గీతంకు భూ కేటాయింపులు నిలిపివేయాలి
మహారాణిపేట : చంద్రబాబు ప్రభుత్వం గీతం విశ్వవిద్యాలయానికి ప్రభుత్వ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు నేతృత్వంలో పార్టీ నేతలు గురువారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడిన కే.కే.రాజు ఎండాడ, రుషికొండ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని ఒక గీతం యూనివర్సిటీకి బదలాయించే ప్రతిపాదనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ ద్వారా ఈ భూమి బదలాయింపు ప్రక్రియ మొదలైందని, జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి ప్రజాస్వామిక చర్చ లేకుండా, సభ్యుల ఆమోదం పొందకుండానే ఏకపక్షంగా దీనిని అజెండాలో చేర్చి ఆమోదించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సదరు 54.79 ఎకరాల్లో గెడ్డ పోరంబోకు, ఇతర ప్రభుత్వ భూముల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని, ఈ కేటాయింపులకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బదలాయింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంబా రవిబాబు మాట్లాడుతూ పేదలకు చెందిన అసైన్డ్ భూములు గీతం యాజమాన్యానికి ఎలా దక్కాయని ప్రశ్నించారు. పేదల భూములను ఆక్రమించి భవనాలు నిర్మించడం అన్యాయమని, ఆ భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఎస్‌సీసీ సభ్యులు బాణాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పీవీ నారాయణ, కోరుకొండ వెంకటరత్న స్వాతి దాస్, పల్లా దుర్గారావు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు (చందు), పేడాడ రమణికుమారి, బర్కత్ అలీ, బొండా ఉమా మహేశ్వరరావు, బోని శివ రామకృష్ణ, జీలకర్ర నాగేంద్ర, కార్పొరేటర్లు దౌలపల్లి ఏడుకొండల రావు, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, శశికల, పీవీ సురేష్, గుడివాడ సాయి అనూష లతీష్, వార్డు అధ్యక్షులు బొడ్డేటి గోవింద్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జిల్లా కార్యదర్శి ఉమ్మడి దాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


