భూచి | - | Sakshi
Sakshi News home page

భూచి

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

భూచి

భూచి

రిజిస్ట్రేషన్ల

విశాఖ సిటీ: సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి సామాన్యులను నిలువునా ముంచుతోంది. ధరల పెంపు ఎత్తుగడలతో ప్రజలకు కుచ్చు టోపీ పెడుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే విద్యుత్‌ చార్జీలు, భూముల ధరలు పెంచి నడ్డివిరిచింది. వరుసగా రెండో ఏడాది కూడా భూముల విలువ పెంపు పేరుతో క్రయ, విక్రయదారులను గందరగోళానికి గురిచేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్‌ విలువను పెంచుతున్నట్లు ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఇందుకు అవసరమైన సవరణలకు కసరత్తు చేయాలని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు జిల్లాలో ప్రధానంగా జీవీఎంసీ పరిధిలో 15 నుంచి 50 శాతం మేర ధరల పెంపునకు కసరత్తు చేపట్టారు. ఈనెల ఒకటో తేదీ నుంచి భారీగా భూములు విలువ పెరుగుతుందని ప్రకటించారు. దీంతో భూముల క్రయ విక్రయదారులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు క్యూ కట్టారు. భూముల విలువ పెరగక ముందే అప్పులు చేసైనా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి పోటీ పడ్డారు. దీంతో జనవరి చివరి వారంలో జిల్లాలో ఉన్న 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి.

ప్రభుత్వం ‘డెడ్‌ లైన్‌’ రాజకీయం?

ఈ నెల ఒకటో తేదీ నుంచి రేట్లు పెరుగుతాయన్న ప్రచారంతో జనవరి చివరి వారంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. పెరిగే భారం నుంచి తప్పించుకోవడానికి మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసైనా సరే జనవరి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని పరుగులు తీశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఒక్కసారిగా భారీ ఆదాయం సమకూరింది. కేవలం జనవరి నెలలోనే విశాఖ జిల్లాలో సుమారు రూ.113.79 కోట్ల ఆదాయం లభించినట్లు తెలుస్తోంది. ఇది గత ఏడాది జనవరితో పోలిస్తే 10.56 శాతం వృద్ధి నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి విశాఖ జిల్లాలోని 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రూ.1,349.80 కోట్ల లక్ష్యం విధించగా, డిసెంబర్‌ నాటికే రూ.848.34 కోట్లు వసూలయ్యాయి. జనవరి నాటికి మరో రూ.వంద కోట్లకు పైగా ఖజానాకు చేరింది.

ఒడిదుడుకుల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం

విశాఖలో ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒడిదుడుకుల్లో ఉంది. ఇలాంటి సమయంలో మార్కెట్‌ విలువను భారీగా పెంచితే అది సామాన్యుడి సొంతింటి కలను దూరం చేయడమే అవుతుంది. ఈ అంశం రాజకీయంగా నష్టం కలిగిస్తుందని భావించే ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా వాయిదా వేసి ఉండొచ్చని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. భూములు విలువ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నా.. లీకులతో భూముల కొనుగోలుదారులు భయపడి ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను ఒత్తిడికి గురిచేసి ఆదాయం పిండుకోవడం వంటి చర్యలపై విశాఖ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భూముల విలువ పెంపుపై సర్కారు హడావుడి ఈనెల ఒకటి నుంచి కొత్త ధరలు అంటూ లీకులు 25 నుంచి 50 శాతం వరకు పెరుగుతాయని లీకులు ఆ భయంతో జనవరిలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు జనాలు పరుగులు దీంతో జనవరి నెలలో రూ.113.79 కోట్ల ఆదాయం నెలాఖరు నాటికి పెంపు నిర్ణయం వాయిదా వేస్తున్న ప్రకటన ఆదాయం కోసం ప్రభుత్వం మైండ్‌ గేమ్‌? ప్రజల వ్యతిరేకతతో యూటర్న్‌?

బురిడీ కొట్టించి.. జేబులు ఖాళీ చేసి..!

తీరా గత నెల చివరిలో ధరల పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం తూచ్‌ అంది. భూముల విలువ సవరణకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీనిని బట్టి చూస్తే, కేవలం ఆర్థిక సంవత్సరం ముగింపులో ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఆడిన ‘మైండ్‌ గేమ్‌’ అని ప్రజలు మండిపడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇప్పటికే కుదేలై, రియల్టర్లు దివాలా తీస్తున్న తరుణంలో, ఇలాంటి హడావుడి ప్రకటనలతో జనాన్ని బురిడీ కొట్టించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెంపు నిర్ణయం వాయిదా వేయడం వెనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూముల ధరల పెంపుపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిసారి ముందస్తు లీకులు ఇవ్వడం.. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తే చివరి నిమిషంలో వాటిని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement