14 నుంచి 21 వరకు చేపల వేట నిషేధం
ఎంవీపీకాలనీ : విశాఖ సాగర తీరంలో ఈ నెల 15వ తేదీ నుంచి 25 తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), మిలాన్ నేపథ్యంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు తూర్పు నావికాదళం, జిల్లా మత్స్యకారశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 19వ వార్డు పెదజాలరిపేటలో గురువారం జిల్లా మత్స్యకార శాఖ, ఈస్ట్రన్ నేవల్ కమాండ్, మైరెన్ పోలీసు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారులు చేపల వేట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యకార శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ మిలాన్ నేపథ్యంలో భద్రతా చర్యలు దృష్ట్యా ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కోస్టల్ సెక్యురిటీ, హైసైనిక్ కండిషన్, కమ్యూనికేషన్, కలర్ కోడ్, సేఫ్ ఫిషింగ్ యాక్టివిటీకి సంబంధించిన అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫిషరీస్ డవలప్‌మెంట్ ఆఫీసర్ ఎం.ఆర్.ఆశాజ్యోతి, నావికాదళాధికారులు, మైరెన్ పోలీసులు పాల్గొన్నారు.


