మందుకు బానిసైన వ్యక్తికి ఆలయ పీఠమా?
బీచ్‌రోడ్డు: పదేళ్లుగా భార్య, బిడ్డను పట్టించుకోకుండా అన్యాయం చేసిన వ్యక్తికి పవిత్రమైన దేవస్థానంలో పదవి ఎలా ఇస్తారని బాధితురాలు మద్ది వసుంధర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ ఆలయం ధర్మకర్తల మండలి చైర్మన్‌గా మద్ది శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ ఆమె ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. 2015లో పెద్దల సమక్షంలో తనకు శ్రీనివాసరావుతో వివాహం జరిగిందని ఆమె తెలిపారు. ఏడాదికే ఒక పాప పుట్టిందని, ఆ తర్వాత నుంచి అతను మందుకు బానిసై, వ్యభిచార గృహాల్లో తిరుగుతూ తనను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని ఆరోపించారు. దీనిపై అనేకసార్లు పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లామని, ఎప్పటికై నా మనసు మార్చుకొని తిరిగి మమ్మల్ని చూసుకుంటాడని ఎంతో ఆశతో ఎదురుచూశామన్నారు. గడిచిన పదేళ్లలో తనను గానీ, పాపను గానీ కనీసం పట్టించుకోలేదని, తమ పోషణకు ఎలాంటి ఆర్థిక సహకారం అందించకుండా వదిలేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మందుకు బానిసై, అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తిని పవిత్రమైన ఆలయంలో ధర్మకర్తగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తి పదవిలో ఉంటే, ఆలయానికి వచ్చే భక్తులను ఎటువంటి దృష్టితో చూస్తారో, వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి నీచుడిని తక్షణమే ఆ పవిత్రమైన పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్ది శ్రీనివాసరావును ధర్మకర్తల మండలి నుంచి తొలగించాలని కోరుతూ ఈవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కుటుంబంతో కలిసి నిరసన చేస్తున్న ఆమెకు పోలీసులు నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
కేసు నమోదులో జాప్యం
నిరసన తెలిపిన ఆమెకు న్యాయం చేస్తామని చెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లిన మూడో పట్టణ పోలీసులు, కేసు నమోదు చేయకుండా జాప్యం చేశారు. నిరసన సమయంలో మూడో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పిన పోలీసులు.. తీరా స్టేషన్‌కు వెళ్లాక మాట మార్చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. భీమిలి స్టేషన్‌కు వెళ్లాలని, రేపు రావాలని, కేసు నమోదుకు సమయం పడుతుందని.. ఇలా రకరకాలుగా మాటలు మారుస్తూ స్టేషన్‌లోనే ఉంచుతున్నారని వాపోయారు. మహిళలను సాయంత్రం 6 గంటల తరువాత స్టేషన్‌లో ఉంచకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, తన కుమార్తెకు న్యాయం చేయకుండా అలా స్టేషన్‌లో కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.


