ఎన్నికల హామీల మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి
బీచ్‌రోడ్డు: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం రద్దయిన ఎస్సీల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు, 50 ఏళ్లకే పింఛన్, డీబీటీ, ఇతర పద్దుల్లో ఎస్సీల వాటా నిధులకు రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కనీసం రూ.40 వేల కోట్లు కేటాయించాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండు చేశారు. బడ్జెట్ కేటాయింపులపై సబ్ ప్లాన్ వాటాదారులైన ఎస్సీ, ఎస్టీలతో సంప్రదించాలన్నారు. విదసం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన సోమవారం ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా రద్దయిన 20 పథకాల పునరుద్ధరణకు, ఇతర కేటాయింపులకు అదనపు నిధులు ప్రకటించాలన్నారు. గతేడాది పేర్కొన్న రూ.20 వేల కోట్ల నిధుల్ని కూటమి ప్రభుత్వం డీబీటీ పథకాలకు కేటాయించేసిందని ఆక్షేపించారు.
పౌర హక్కుల నేత తుంపాల శ్రీరామమూర్తి మాట్లాడుతూ గతేడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తామని జీవో ఇచ్చి, ఇప్పుడు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఇస్తామనడం పచ్చి మోసమని మండిపడ్డారు. డి.నిర్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విదసం విశాఖ జిల్లా నాయకులు గుడాల ఈశ్వరరావు, కొత్తపల్లి వెంకటరమణ, బాగం గోపాల్, బి.ఉమామహేశ్వరి, రాజేంద్రప్రసాద్, జేవీ భాస్కరరావు, సబ్బవరపు శ్రీనివాసరావు, గుడివాడ భాస్కరరావు, బాణాస రామ్ ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీల మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి


