సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు
సింహాచలం : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జే.వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయశాఖ ఎక్స్ అఫీషియో ప్రభుత్వ కార్యదర్శి ఎం. హరిజవహర్‌లాల్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కాకినాడ డీఆర్‌వోగా విధుల్లో ఉన్న వెంకటరావును ఏడాది కాలపరిమితితో డిప్యుటేషన్‌పై సింహాచలానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నూతన ఈవోగా నియమితులైన వెంకటరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత బుధవారమే ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి బదిలీ ఉత్తర్వులు రాగా, శుక్రవారంతో దేవదాయశాఖ ప్రక్రియ కూడా పూర్తయింది.
జీవీఎంసీ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ శుక్రవారం జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్షించారు. పూర్ణామార్కెట్ సమీపాన వెలంపేట మురికివాడ ప్రాంతంలో నివసిస్తున్న 177 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇళ్ల నిర్మాణంలో ఆర్థికపరమైన అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత ఇతర అధికారులతో సమీక్షించారు.
పాత స్పెషల్ రైళ్లే కొత్తవిగా ప్రకటన
తాటిచెట్లపాలెం : ప్రస్తుతం నడుస్తున్న పాత స్పెషల్ రైళ్లను హోలీ స్పెషల్స్‌గా రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. అంతేగానీ కొత్తగా హోలీ పండక్కి కొత్త రైళ్లేమీ వేయలేదు. ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో నడుస్తున్న సుమారు 62 స్పెషల్ రైళ్లు మార్చి నెలాఖరు వరకు హోలీ స్పెషల్స్ పేరుతో నడుపుతున్నారు. సంబల్‌పూర్–ఈరోడ్–సంబల్‌పూర్, విశాఖపట్నం–తిరుపతి–విశాఖపట్నం, విశాఖపట్నం–ఎస్‌ఎంవీబి బెంగళూరు–విశాఖపట్నం, విశాఖపట్నం–చర్లపల్లి–విశాఖపట్నం, విశాఖపట్నం–షాలిమర్–విశాఖపట్నం, పూరీ–పాట్నా–పూరీ, పూరీ–ఉధ్నా–పూరీ, భువనేశ్వర్–యశ్వంత్‌పూర్–భువనేశ్వర్, భువనేశ్వర్–ధన్‌బాద్–భువనేశ్వర్ రైళ్లు మార్చి వరకు నడుస్తాయి.


