విశాఖ తల్లఢిల్లీ
మించిపోయిన వైజాగ్
ఎయిర్ క్వాలిటీ రిపోర్టు
ఏయూక్యాంపస్: పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న విశాఖలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది. తాజా గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన 195 ఏక్యూఐ కంటే ఎక్కువగా విశాఖలో 205 ఏక్యూఐ నమోదు కావడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం నాటికి హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలను సైతం వెనక్కి నెట్టి విశాఖ కాలుష్యంలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత జనవరి నెలలో మెజారిటీ రోజులు గాలి నాణ్యత అనారోగ్యకరమైన స్థాయిలోనే కొనసాగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు
నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి జరిపిన పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పోలీస్ బ్యారక్స్ వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 305కు చేరుకుని ‘వెరీ పూర్’ విభాగంలోకి వెళ్లగా, మాధవధార వంటి నివాస ప్రాంతాల్లో కూడా కాలుష్యం పరిమితికి లోబడే ఏమీ లేదు. మింది, ఆటోనగర్, మల్కాపురం, సీతమ్మధార వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. గాలిలో పీఎం 2.5, పీఎం 10 కణాలు పెరిగిపోవడంతో పాటు కార్బన్ మోనాౖక్సైడ్, సల్ఫర్ డయాకై ్సడ్ వంటి విషవాయువులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
పారిశ్రామిక వ్యర్థాలు,
పెరుగుతున్న వాహన రద్దీ
విశాఖలో గాలి విషతుల్యం కావడానికి ప్రధానంగా పోర్ట్ కార్యకలాపాలు, భారీ పరిశ్రమలు కారణమవుతున్నాయి. పోర్ట్ ప్రాంతంలో బొగ్గు, ఇతర లోహాల ఎగుమతి దిగుమతుల సమయంలో వెలువడే ధూళి గాలిని కలుషితం చేస్తోంది. దీనికి తోడు హెచ్‌పీసీఎల్, స్టీల్ ప్లాంట్, ఫార్మా రంగానికి చెందిన ఉద్గారాలు తోడవుతున్నాయి. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య, డీజిల్ యంత్రాల వినియోగం మరియు నిర్మాణ రంగం నుంచి వెలువడే దుమ్ము ధూళి వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఇవన్నీ కలిసి నగరాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి.
నగర ప్రజలపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం విశాఖలో గాలి నాణ్యత క్షీణత ఏ స్థాయిలో ఉందంటే, నగరంలో నివసించే ప్రతి వ్యక్తి రోజుకు సగటున మూడు సిగరెట్లు కాల్చినప్పుడు ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టానికి గురవుతున్నారు. అంటే నెలకు దాదాపు 81 సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దీనివల్ల ఆస్తమా, సైనస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైర్లను వాడటం, రద్దీ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ప్రాణరక్షణకు అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విశాఖ తల్లఢిల్లీ


