దాడులకు భయపడం
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల
గాజువాక : తిరుమల లడ్డూ వివాదంలో తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. శుక్రవారం గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ నివేదికలోనే స్పష్టమైందని, దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులు చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా తాము వెనకడుగు వేయబోమని, తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతామని శ్యామల స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను ప్రశ్నించకుండా అడ్డుకోవాలనుకోవడం భ్రమ అని, 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాజువాక మహిళా విభాగం అధ్యక్షురాలు పల్లా చినతల్లి, 68వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సండ్రాన నూకరాజు పాల్గొన్నారు.


