2 నెలల్లో ఉక్కు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు రెండు నెలల్లో పరిష్కారిస్తామని స్టీల్‌ప్లాంట్ ఇన్‌చార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా అన్నారు. బుధవారం స్టీల్‌ప్లాంట్ ఎల్‌డీసీ ఆడిటోరియంలో కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులు, కార్మికులతో జరిగిన ఇంటాక్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సెయిల్‌కు చెందిన ఇతర ప్లాంట్లతో పోలిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్ పనితీరు ప్రైవేటు ప్లాంట్ల స్థాయిలో ఉందన్నారు. ఉత్పత్తి వ్యయం టన్నుకు 7 వేల వరకు తగ్గించే కీలక విభాగాలను గుర్తించామన్నారు. వాటిపై ప్రధాన దృష్టి సారిస్తామన్నారు. ప్రతీ విభాగం వారీగా సామర్ధ్యం పెంచడం, ఖర్చులు తగ్గించడం ఎలా అన్నదానిపై యోచించాల్సి ఉందన్నారు. కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పాండ్రిక్ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తక్కువ అంచనాలతో వచ్చామని, ఊహించిన దాని కంటే మంచి ఫలితాలు ఇచ్చారని ప్రశంసించారు. విశాఖ ఉక్కు ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి బ్రాండ్ విలువ ఉందన్నారు. వెళ్లిపోయిన కస్టమర్లను తిరిగి తీసుకు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వశాఖల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ పట్ల దృక్పథం మారిందన్నారు. స్టీల్‌ప్లాంట్ రుణాలపై వడ్డీ రేటు 14 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గిందన్నారు. ఇంకో సంవత్సరం ఇదే ఉత్సాహంతో పని చేసి ప్లాంట్‌ను మరింత ప్రగతి పథంలోకి తీసుకు వెళ్లాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌కు పదోన్నతులు ఇస్తామన్నారు. 5, 10 ఏళ్ల తర్వాత సమస్యలు రాకుండా కొత్త మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకాలు చేపడతామన్నారు. అధికారులు, కార్మికులను జిందాల్ వంటి ప్రైవేటు స్టీల్‌ప్లాంట్‌ల విజిట్‌కు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఉక్కు ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా


