ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐయాన్స్ నిర్వహణపై సమీక్ష
అల్లిపురం: నగరంలో ఈ నెల 14 నుంచి 25 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్– కాన్‌క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ అంతర్జాతీయ సదస్సులకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, విశిష్ట అతిథులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల రాకను పురస్కరించుకుని ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం, వారు బస చేసే ప్రాంతాలు, కార్యక్రమ వేదికల వద్ద బందోబస్తు నిర్వహించడంపై కమిషనర్ సుదీర్ఘంగా చర్చించారు. వీఐపీల రాకపోకల కోసం కేటాయించిన రోడ్డు మార్గాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, భద్రతా దృష్ట్యా నగరాన్ని ‘నో డ్రోన్ జోన్’గా ప్రకటించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కీలక సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ప్రతినిధులు, ఎయిర్‌పోర్టు, సీపోర్టు అధికారులు పాల్గొనగా.. వారితో పాటు రైల్వే, సీఐఎస్‌ఎఫ్, ఫిషరీస్, ఫైర్ సర్వీస్ విభాగాల అధికారులు కూడా హాజరయ్యారు. పోలీస్ శాఖ తరఫున డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొని క్షేత్రస్థాయిలో భద్రతా ప్రణాళికల అమలుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


