ఫిర్యాదులు
తిరుమల లడ్డూపై టీడీపీ దుష్ప్రచారంపై వరుస కేసులు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వై.ఎస్.జగన్ ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టడంపై ఆగ్రహం
జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
మాజీ మంత్రులపై దాడులు చేసిన వారి అరెస్టుకు డిమాండ్
పచ్చనేతల తప్పుడు ప్రచారాలపై
సాక్షి, విశాఖపట్నం: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు లేదని సీబీఐ ఆధ్వర్యంలో సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు చేసిన పాపం ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న భయం కూటమి నేతల్లో మొదలైంది. అసత్య ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పించుకునేందుకు విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు తెరతీసింది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ౖవైవీసుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తోంది. హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ అసత్య ఆరోపణలు చేస్తోంది. ఈ ఫ్లెక్సీలు పెట్టిన వారిపైనా, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిపై దాడులకు పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లలో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు.
● గాజువాక నియోజకవర్గంలో సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి న్యూపోర్టు పోలీసుస్టేషన్‌లో సీఐ కామేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేస్తున్న, సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్పొరేటర్లు గుడివాడ అనూష, మహ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి చందుతో పాటు పార్టీ నేతలు మార్టుపూడి పరదేశి, కోమటి శ్రీనివాసరావు పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
● విశాఖ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఎంవీపీ పోలీస్‌స్టేషన్ సీఐ ప్రసాదరావుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదును అందజేశారు. తిరుమల లడ్డూపై నిరాధార ఆరోపణలతో వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేయడమే కాకుండా తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడిన కూటమి నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, కార్పొరేటర్లు మువ్వల లక్ష్మి, మొల్లి లక్ష్మి, పల్లా దుర్గారావు, పార్టీ ముఖ్యనేతలు పేర్ల విజయచందర్, అల్లంపల్లి రాజుబాబుతోపాటు వైఎస్సార్‌సీసీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
● విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానికీరామ్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వరప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు సనపల రవీంద్ర భరత్, ముజిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రామానంద్ ఆధ్వర్యంలో టూటౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. 27వ వార్డు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఫోర్తు టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు. 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు.
● విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 56వ వార్డు కార్పొరేటర్ గుండాపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణ్‌రావు, పీవీ సురేష్ మల్కాపురం సీఐ గొలగాని అప్పారావుకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మళ్ల ధనలత, రేవల్ల సత్యనారాయణ, వై.రాజు, పిలకా రాము పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


