అరాచకం! | - | Sakshi
Sakshi News home page

అరాచకం!

Feb 8 2026 3:48 AM | Updated on Feb 8 2026 3:48 AM

అరాచకం!

అరాచకం!

ప్రభుత్వ నీడలో ఏయూలో
ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టాలంటూ ఒత్తిళ్లు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

తాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఆంధ్రా యూనివర్శిటీలో సంబరాల సందడి కంటే, బెదిరింపుల హడావుడే ఎక్కువగా వినిపించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక పవిత్రమైన విద్యా వ్యవస్థలో నాన్‌–టీచింగ్‌ స్టాఫ్‌కు చెందిన ఓ వ్యక్తి రిజిస్ట్రార్‌ పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన ఇప్పుడు ఏయూలో చర్చనీయాంశంగా మారింది. ప్రింటింగ్‌ ప్రెస్‌కు సంబంధించిన ఐటెమ్స్‌, స్టేషనరీని గత ప్రభుత్వ హయాంలో బయట విక్రయించారంటూ ఫిర్యాదు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పాటు, ఖాళీ పేపర్లపై సంతకాలు చేసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఏయూ రిజిస్ట్రార్‌ పేరుతోనే సాగుతున్నట్టు సమాచారం. ఖాళీ పత్రాలపై సంతకాలు చేయకపోతే పదోన్నతులు ఇవ్వమంటూ బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఏయూ వాతావరణాన్ని కలవరపెట్టడమే కాకుండా, సిబ్బందిలో భయాందోళనలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఏయూ సౌత్‌ క్యాంపస్‌లోని ఏయూ ప్రెస్‌ సిబ్బంది నేరుగా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, గవర్నర్‌ పీఎస్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి కూడా ఫిర్యాదు కాపీ పంపడం గమనార్హం.

మూల్యాంకన సమయంలో అనధికార జోక్యం

ఏయూలోని వాల్యూయేషన్‌ క్లస్టర్‌లో పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతున్న సమయంలోనే, ఈ నెల 4వ తేదీన బెదిరింపుల వ్యవహారం చోటుచేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన నాన్‌–టీచింగ్‌ స్టాఫ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి, గత ప్రభుత్వ హయాంలో ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకతవకలు జరిగాయని, స్టేషనరీని బయట విక్రయించారంటూ ఫిర్యాదు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఖాళీ పత్రాలపై సంతకాలు చేస్తే మిగతా విషయాలు తామే రాసుకుంటామని చెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి.

రిజిస్ట్రార్‌ పేరుతో బెదిరింపులు

ఫిర్యాదు చేయకపోతే పదోన్నతులు ఉండవంటూ భయపెట్టినట్టు ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్‌ పేరును ప్రస్తావించడమే అసలు వ్యవహారంలో కీలకంగా మారింది. దీనిపై రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, అదే కాపీని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, గవర్నర్‌ పీఎస్‌కు కూడా పంపారు. మొత్తంగా ఈ వ్యవహారం ఏయూ ప్రతిష్టను దెబ్బతీసి, ఓ ప్రైవేటు విద్యా సంస్థకు లబ్ధి చేకూర్చే కుట్రలో భాగమేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

నాడు ఘనచరిత్ర

గత ప్రభుత్వ హయాంలో దేశంలోనే అరుదైన గౌరవంగా ఏయూకు న్యాక్‌ ‘ఏ++’ గ్రేడ్‌ లభించింది. క్యూములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (సీజీపీఏ) 3.74గా నమోదై, ఈ స్థాయి స్కోరు సాధించిన దేశంలోని మూడు యూనివర్శిటీల్లో ఒకటిగా ఏయూ నిలిచింది. స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లు, చైర్‌ ప్రొఫెసర్ల నియామకం, 100 పేటెంట్లకు దరఖాస్తులు వంటి అనేక వినూత్న చర్యలు చేపట్టారు. ‘ఏ హబ్‌’ ద్వారా యువతకు ప్రోత్సాహం అందించడంతో సుమారు 150 స్టార్టప్స్‌ ఏర్పడ్డాయి. దూరవిద్యలో డిఫెన్స్‌ కోర్సులు ప్రవేశపెట్టి డిఫెన్స్‌ రంగంలో పనిచేసేవారికి ఉపయోగకరంగా మార్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యంశాల్లో మార్పులు తెచ్చారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల విషయంలో కూడా ఏయూ కొత్త చరిత్రను లిఖించిందనే చెప్పవచ్చు.

ఏయూను దెబ్బతీసే యత్నమా?

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ఏయూను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిఫెన్స్‌ కోర్సులను దూరవిద్య నుంచి తొలగించడం, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లను తగ్గించడం, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి ఏయూ నుంచి దూరం చేసే యత్నం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు తగ్గిపోవడంతో ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇతర ప్రైవేటు కాలేజీల్లో జరిగే డ్రైవ్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. హాస్టళ్లలో అన్నం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఏయూ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే చర్యలు చేపట్టకుండా, ప్రింటింగ్‌ ప్రెస్‌లో సమావేశాలు పెట్టి తప్పుడు ఫిర్యాదులకు ఒత్తిడి తెస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

లేవంటే ప్రమోషన్లు దక్కవంటూ హెచ్చరికలు

వాల్యూయేషన్‌ సెంటర్లో అనధికారిక సమావేశాలు

రిజిస్ట్రార్‌ పేరుతో నాన్‌–టీచింగ్‌ స్టాఫ్‌కు చెందిన రమణ అడ్డగోలు వ్యవహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement