బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్‌

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

బంగార

బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్‌

అల్లిపురం: శ్రీకాకుళం వెళ్లే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించిన ఇద్దరు మహిళా దొంగలను ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను క్రైం డీసీపీ కె. లతా మాధురి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన వోల్లా జ్యోతి .. తన తల్లితో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ప్రయాణ సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి బ్యాగులోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. మరుసటి రోజు నగలు కనిపించకపోవడంతో విషయాన్ని గమనించిన బాధితురాలు, తన భర్త ద్వారా ‘డయల్‌ 112’ కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, ఆటోలో తమతో పాటు ప్రయాణించి సంగం శరత్‌ థియేటర్‌ వద్ద దిగిపోయిన ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తమైంది. నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, రైల్వే న్యూ కాలనీ జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తూ తప్పించుకోబోతున్న ఇద్దరు మహిళలను వెంబడించి పట్టుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేకల గంగ, అనకాపల్లి జిల్లా కె. కోటపాడుకు చెందిన రావుల ఎల్లారమ్మలుగా గుర్తించారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలను (రెండు నెక్లెస్‌లు, ఆరు గాజులు) స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేవలం గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.

బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్‌1
1/1

బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement