‘గీతా’ గానానికి విశాఖ ఫిదా
ఏయూక్యాంపస్: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఆర్.కె.బీచ్, గోకుల్ పార్క్ వేదికలుగా బుధవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా అలరించాయి. ప్రధాన వేదికపై సినీ గాయని గీతామాధురి తన గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ‘మహానుభావుడవేరా.. నువ్వే నా మహానుభావుడవేరా’అంటూ ప్రదర్శనను ప్రారంభించిన ఆమె, తన పాటల ప్రవాహంతో యువతలో జోష్ నింపారు. మనసున మనసై.., తోడొకరుండిన అదే భాగ్యము.. వంటి మలయ మారుతాలతో పాటు, చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు వంటి హుషారైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక జామురాతిరి.. జాబిలమ్మ వంటి జోలపాటలు, మగాళ్లు ఒట్టి మాయగాళ్లు వంటి సరదా గీతాలతో ఆమె చేసిన సందడి విశాఖ వాసులను కట్టిపడేసింది. ఇదే వేదికపై కళాకారుడు సురేష్ ప్రదర్శించిన రెండు ప్రత్యేక ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. సాధనతో ఏదైనా సాధ్యమే అనే ఇతివృత్తంతో సాగిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు గోకుల్ పార్క్ వేదికపై స్థానిక, ఇతర రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆహూతులను ఆశ్చర్యపరిచాయి. వై.కె.రాజు మిమిక్రీ నవ్వులు పూయించగా, శ్రీకృష్ణ లీల బృంద నృత్యం భక్తిభావాన్ని పంచింది. తెలంగాణ, బంగ్లా, నేపాలీ జానపద నృత్యాలతో పాటు అస్సామీ ఫోక్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాక్సాఫోన్ వాయిద్యం, కళ్లకు గంతలు కట్టుకుని చేసిన నృత్యం, జగ్లింగ్, మ్యాజిక్ షోలు పిల్లలు, పెద్దలను ఎంతగానో అలరించాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు


