పడవల పోటీల విజేతలకు నిరాశ
భీమునిపట్నం: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా గురువారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన పడవలు, తెప్పల పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. తొలుత మధ్యాహ్నం చేపలుప్పాడ తీరం నుంచి భీమిలి తీరానికి(6 కిలోమీటర్ల దూరం) మోటారు పడవల పోటీలను నిర్వహించారు. మొత్తం 15 మోటారు పడవలు పాల్గొనగా, ఈ పోటీలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో భీమిలి ఎగువపేటకు చెందిన సీరం లక్ష్మణ టీం ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన సీరం గణేష్ టీం ద్వితీయ, రాజేష్ టీం తృతీయ స్థానాల్లో నిలిచాయి. అలాగే నాగమయ్యపాలెం నుంచి భీమిలి తీరం వరకు(4 కిలోమీటర్ల దూరం) జరిగిన తెప్పల పోటీల్లో 15 తెప్పలు పాల్గొన్నాయి. ఇందులో భీమిలి బోయివీధికి చెందిన కాసరపు చినపైడిరాజు, కాసరపు ధనరాజు, కాసరపు పేరరాజు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, మండల అధికారి ఈశ్వరరాజు పాల్గొన్నారు. కాగా.. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినవారికి రూ. 25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.15 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. పోటీలు ముగిసిన వెంటనే భీమిలి తీరంలోనే బహుమతులు అందిస్తామని తెలిపి, అక్కడ వేదికను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పోటీలు ముగిసిన తర్వాత బహుమతులను ఇప్పుడు కాకుండా, ఈ నెల 31న ఆర్‌కే బీచ్‌లో జరిగే ముగింపు వేడుకల్లో అందిస్తామని ప్రకటించారు. దీంతో గెలుపొందిన మత్స్యకారులు, ఉత్సాహంగా వేదిక వద్దకు చేరుకున్న స్థానికులు నిరాశతో వెనుదిరిగారు.


