దుమ్మురేపిన రైడర్లు
ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్
విశాఖ స్పోర్ట్స్: జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా శనివారం రాత్రి నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్‌షిప్ ఉత్కంఠగా సాగింది. ఎంఆర్‌ఎఫ్ మోగ్రిప్–ఎఫ్‌ఎంఎస్‌సీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ సీజన్ కై ్లమాక్స్ మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇలాంటి జాతీయ స్థాయి సాహస క్రీడలు నిర్వహించడం నగర ప్రతిష్టను పెంచుతుందని, యువతకు ఇదొక మంచి స్ఫూర్తి అని పేర్కొన్నారు.
హోరాహోరీగా సాగిన రేస్
ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 120 మంది రేసర్లు పాల్గొని 9 విభిన్న విభాగాల్లో(క్లాస్‌ల్లో) పోటీపడ్డారు. సాధారణ మోటోక్రాస్ మాదిరిగా కాకుండా, స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన సూపర్‌క్రాస్ ట్రాక్‌పై ఈ రేస్ సాగింది. టైట్ టర్న్‌లు, రిథమ్ సెక్షన్స్, ఎత్తైన టెక్నికల్ జంప్‌లతో కూడిన ఈ ట్రాక్‌పై రైడర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో, దుమ్ము రేపుతూ బైకులు గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి.
గ్రాండ్ ఫినాలే విజేతలు
సీజన్ పొడవునా పాయింట్లు సాధించి ఫైనల్స్‌కు చేరిన రైడర్లు ఇక్కడ తమ సత్తా చాటారు: ఎస్‌ఎక్స్1 ప్రీమియర్ కేటగిరీలో శ్లోక్, ప్రజ్వల్, ఇక్షన్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎస్‌ఎక్స్2 విభాగంలో ర్యాన్, జాబీ, సుహైల్‌లు తమ బైకులతో మెరుపులు మెరిపించారు. ఇండియన్ ఎక్స్‌పర్ట్స్, జూనియర్ క్లాస్‌లో ఇమ్రాన్, జినేంద్ర, షిండే. చైతన్య వంటి రైడర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఎస్‌ఎక్స్1 ఫారిన్ ఓపెన్ క్లాస్ రేస్‌లోనూ తీవ్ర పోటీ జరిగింది. నిర్వాహకులు ఈ పోటీలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో విశాఖ వాసులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఇంజిన్ల మోత, అభిమానుల కేరింతల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి.


