తుక్కు.. తళుక్కు
వ్యర్థాలతో కళాఖండాలు
రైల్యే ఉద్యోగి కల్యాణ్ చక్రవర్తి
అపూర్వ సృష్టి
పనికిరాని నట్లు, బోల్టులు,
ఇనుప వస్తువులతో కళాకృతులు
తాటిచెట్లపాలెం: సృజనాత్మకతకు హద్దులు లేవని, సంకల్పం ఉంటే పనికిరాని వస్తువులతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కళాఖండాలను సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు నగరానికి చెందిన రైల్వే టెక్నీషియన్ కె.కళ్యాణ్ చక్రవర్తి. ఈస్ట్‌కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్‌లోని డీజిల్ లోకో షెడ్‌లో మెకానికల్ విభాగంలో గ్రేడ్–1 టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, తన వృత్తిలోని యాంత్రిక జీవనానికి కళాత్మకతను జోడించి సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. సాధారణంగా రైల్వే షెడ్‌లలో తుక్కు కింద పక్కన పడేసిన నట్లు, బోల్టులు, బేరింగ్‌లు, స్ప్రింగ్‌లు, పాత ఇంజిన్ భాగాలు ఆయన కంటికి మాత్రం అపురూపమైన ఆకృతులుగా కనిపిస్తాయి. తన ఆలోచనలకు పదును పెట్టి, ఆ లోహ వ్యర్థాలను ఒకదానితో ఒకటి వెల్డింగ్ చేస్తూ ప్రాణం పోస్తున్న కళాఖండాలు నేడు విశాఖ నగరానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి.
55కి పైగా అద్భుత శిల్పాలు
1997లో రైల్వేలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన కళ్యాణ్ చక్రవర్తి, తనలోని చిత్రకారుడిని నిరంతరం సజీవంగా ఉంచుకున్నారు. సీనియర్ అధికారుల ప్రోత్సాహం తోడవ్వడంతో ఆయన ఊహలకు మరింత పదును పెరిగింది. ఆయన సృష్టించిన 12 అడుగుల భారీ గిటార్ మొదలుకొని, ‘మేకిన్ ఇండియా’, సింహం లోగో, గ్లోబ్, డైనోసార్, రోబోట్, సంగీత విద్వాంసుల ఆకృతులు వంటి సుమారు 55కి పైగా అద్భుత శిల్పాలు విశాఖ రైల్వే స్టేషన్, భువనేశ్వర్ ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం, డీజిల్ లోకో షెడ్ వంటి ప్రాంతాల్లో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కేవలం ఇనుప ముక్కలతో ఇంతటి సౌందర్యాన్ని ఎలా సృష్టించగలిగారు అని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల మహాత్మా గాంధీ నూలు వడుకుతున్న చారిత్రాత్మక దృశ్యాన్ని లోహ వ్యర్థాలతో ఆవిష్కరించే బృహత్తర కార్యాన్ని ఆయన తలకెత్తుకున్నారు.
విద్యార్థులకు తర్ఫీదునిస్తూ...
కళ్యాణ్ చక్రవర్తి గొప్పతనం కేవలం శిల్పాలు చెక్కడంలోనే లేదు, తన విద్యను తర్వాత తరానికి అందించాలనే తపన మరువలేనిది. గత రెండు దశాబ్దాలుగా ప్రతి వారాంతం, వేసవి సెలవుల్లో వేలాది మంది చిన్నారులకు ఉచితంగా డ్రాయింగ్ నేర్పిస్తూ వారిలో కళాభిరుచిని పెంచుతున్నారు. తన సృజనాత్మకతకు గాను ఇప్పటికే రైల్వే శాఖ నుంచి అత్యున్నతమైన జీఎం అవార్డుతో పాటు సీఎంఈ, సీఎన్‌పీ వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. వ్యర్థాలను వనరులుగా మార్చడమే కాకుండా, సమాజానికి కళ ద్వారా సందేశాన్ని అందిస్తున్న కళ్యాణ్ చక్రవర్తి నిజమైన ‘సృజన యోధుడు’. ఆయన ప్రయాణం నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
తుక్కు.. తళుక్కు
తుక్కు.. తళుక్కు


