గీతం భూముల క్రమబద్ధీకరణ అక్రమం
అల్లిపురం: గీతం విశ్వవిద్యాలయం ఆక్రమించిన 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘యూరోపియన్ యూనియన్‌తో కేంద్రం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయం, ఉక్కు, ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ ఒప్పందం గొప్పదని మోదీ బాకాలు ఊదుతున్నా.. కార్లు, వైన్ ధరలు తగ్గడం వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు యూరోపియన్ యూనియన్ ఎగుమతులు 107 శాతానికి పెరుగుతాయి. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మోదీ హయాంలో డాలర్‌తో రూపాయి విలువ రూ.60 నుంచి రూ.91.64కు పడిపోయింది.’అని అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయకుండా, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. పేదలు సెంటు స్థలం ఆక్రమిస్తే ఇళ్లు కూల్చివేసే ప్రభుత్వం, గీతం సంస్థ ఆక్రమించిన 54 ఎకరాలను మాత్రం క్రమబద్ధీకరించడానికి పూనుకోవడం అన్యాయమన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎ.విమల, ఎం.పైడిరాజు, ఎస్.కె.రహిమాన్, ఎన్.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


