పలుకు సరస్వతి | - | Sakshi
Sakshi News home page

పలుకు సరస్వతి

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

పలుకు

పలుకు సరస్వతి

పేరు లక్ష్మి..

అవధాన రంగంలో

జయలక్ష్మి అద్భుత ప్రతిభ

పుష్కర ప్రాయంలోనే

‘అష్టావధానం’

క్షరం ఆమెకు ఆటవస్తువు.. సంస్కృతం ఆమెకు ప్రాణవాయువు.. పన్నెండేళ్ల చిరుప్రాయంలోనే ఉద్ధండ పండితులు సైతం విస్తుపోయేలా సంస్కృత అష్టావధానాలు చేస్తూ అసాధారణ ప్రతిభను చాటుతోంది నరసింహదేవర జయలక్ష్మి. మైథిలీనాథ్‌, కిరణ్మయి దంపతుల పుత్రికగా, కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి నామానుగ్రహంతో జన్మించిన ఈ బాలిక, నేడు సాహితీ లోకంలో ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం బెంగళూరులోని పూర్ణప్రమతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జయలక్ష్మి, అటు ఆధునిక విద్యలోనూ, ఇటు ప్రాచీన సంస్కృత సాహిత్యంలోనూ అద్వితీయమైన ప్రజ్ఞను కనబరుస్తోంది.

గురువుల శిక్షణలో..

గురువుల శిక్షణలో రాటుదేలిన ప్రతిభ ప్రవచన రాజహంస, అభినవ వాల్మీకి వంటి బిరుదాంకితులు, సంస్కృతాంధ్రా అవధానాల్లో అగ్రగణ్యులైన దూళిపాళ మహాదేవమణి సుశిక్షణలో జయలక్ష్మి అవధానిగా రూపుదిద్దుకుంది. అలాగే మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, కవితాకళానిధి నరసింహదేవర ఉమామహేశ్వరశాస్త్రి వంటి దిగ్గజాల మార్గదర్శకత్వం ఈమె ప్రతిభా వికాసానికి బలమైన పునాదిగా నిలిచింది. కేవలం నాలుగేళ్ల వయసు నుండే శ్లోక రచన ప్రారంభించిన జయలక్ష్మి, ఏడేళ్లకే ‘శ్యమంతకోపాఖ్యానం’, తొమ్మిదేళ్లకే ‘పిబరే రామరసం’ పేరుతో సంక్షిప్త రామాయణాన్ని రచించి తన మేధాశక్తిని నిరూపించుకుంది. ఇప్పటివరకు సుమారు 800 శ్లోకాలతో పాటు, తన సొంత ముద్రతో 16 దేవతా కృతులను సృజించడం సామాన్యమైన విషయం కాదు.

కాశీ నుంచి విశాఖ వరకు..

కాశీ నుంచి విశాఖ వరకు.. జయలక్ష్మి అవధాన ప్రయాణం అత్యంత పవిత్రంగా ప్రారంభమైంది. 2025 అక్టోబర్‌ 26న కాశీ విశ్వనాథుని సన్నిధిలో జగద్గురువుల ఆశీస్సులతో, సామవేదం షణ్ముఖ శర్మ వంటి మహామహుల సమక్షంలో తన తొలి సంస్కృత అవధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఆ తర్వాత పల్లిపాలెంలో విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సమక్షంలో రెండో అవధానం, ఈ ఏడాది జనవరిలో అనంతపురం శంకరమఠంలో శలాక రఘునాథశర్మ అధ్యక్షతన మూడో అవధానం పూర్తి చేసి పండితుల ప్రశంసలు పొందింది. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమస్యాపూరణ పోటీలో ద్వితీయ స్థానం సాధించడం ఆమె ప్రతిభకు మరో నిదర్శనం. నాలుగో అవధానం మంగళవారం విశాఖ ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో పూర్తి చేసింది.

పండితుల ప్రశంసలు

తన గురువు దూళిపాళ మహాదేవమణి సంచాలకత్వంలో జయలక్ష్మి మంగళవారం తన నాలుగవ సంస్కృత అష్టావధానంతో పండితులను ఔరా అనిపించింది. ఈ అవధానంలో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి, ఆశువు, ఘంటావధానం, అప్రస్తుత ప్రసంగం వంటి క్లిష్టమైన ఎనిమిది అంశాలను ఆమె అవలీలగా ఎదుర్కోంది. అపారమైన ధారణా శక్తి, అప్పటికప్పుడు పద్యాలను అల్లగలిగే సృజనాత్మకత కలిగిన జయలక్ష్మి, భావితరాలకు మన ప్రాచీన భాషా వైభవాన్ని చాటిచెప్పే స్ఫూర్తిప్రదాతగా నిలుస్తోంది. భగవద్గీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, చిన్న వయస్సులోనే ఇంతటి పాండిత్యాన్ని సంపాదించిన ఈ బాల మేధావి ప్రస్థానం సాహితీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం.

ఏకాగ్రత, అపార జ్ఞాపకశక్తి, భాషా పరిజ్ఞానం మేళవిస్తేనే సాధ్యమయ్యే ‘అష్టావధానం’ వంటి క్లిష్టమైన ప్రక్రియను చిరు ప్రాయంలోనే అవలీలగా చేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది నరసింహదేవర జయలక్ష్మి. బెంగళూరులో ఏడో తరగతి చదువుతున్న ఈ చిచ్చరపిడుగు, ఇప్పటికే మూడుసార్లు సంస్కృత అవధానం నిర్వహించి శభాష్‌ అనిపించుకుంది. మంగళవారం సాయంత్రం విశాఖ ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో జరిగిన తన నాలుగవ సంస్కృత అష్టావధానంలో సాహితీ దిగ్గజాల మధ్య తన ప్రతిభను చాటింది. పృచ్ఛకులు విసిరిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పద్యాలను అప్పటికప్పుడు అల్లి, ధారణా శక్తితో వాటిని తిరిగి చెప్పిన తీరు చూసి సాహితీవేత్తలు విస్మయం చెందారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఈ బాలిక వారధిలా నిలుస్తోందని పండితులు ప్రశంసల జల్లు కురిపించారు. – సీతంపేట

పలుకు సరస్వతి1
1/1

పలుకు సరస్వతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement