నేటి నుంచి ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
అల్లిపురం: ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌కు ఆనుకొని అదనపు బ్రిడ్జి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆంక్షల ప్రకారం విశాఖ నగరం నుంచి విమానాశ్రయం వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలు తప్పనిసరిగా ఫ్లైఓవర్ పైనుంచే ప్రయాణించాలని, కింద నుంచి ఎటువంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా గోపాలపట్నం, మర్రిపాలెం వైపు నుంచి ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే వాహనాలు కూడా ఫ్లైఓవర్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి గోపాలపట్నం, మర్రిపాలెం, విశాఖ నగరం వైపు వచ్చే వాహనాలన్నీ కూడా ఫ్లైఓవర్ పైనుంచే రావాలని, కింద మార్గంలో ప్రవేశం ఉండదని వివరించారు. గోపాలపట్నం, మర్రిపాలెం మధ్య రాకపోకలు సాగించే మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్ల వంటి తేలికపాటి వాహనాలను మాత్రం ఫ్లైఓవర్ కింద నుంచి అనుమతిస్తామని, అయితే ఈ మార్గంలో ప్రయాణించే లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలు మాత్రం కచ్చితంగా ఫ్లైఓవర్ మీదుగానే వెళ్లాలని నిర్దేశించారు. నిర్మాణ పనుల దృష్ట్యా విధించిన ఈ మార్పులను గమనించి ద్విచక్ర వాహనాల నుండి భారీ వాహనాల వరకు అన్ని రకాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.


