ప్రేమ, స్నేహం, సేవతోనే సమాజ హితం
సీపీ శంఖబ్రత బాగ్చి
ఏయూక్యాంపస్: శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డులో సత్యసాయి రన్–రైడ్(సైక్లింగ్)–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐక్యత, ఫిట్ ఇండియా స్ఫూర్తి లక్ష్యంగా సత్య సాయి సేవా సంస్థలు చేపట్టిన ఈ ర్యాలీని కాళీమాత ఆలయం వద్ద నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావులు జెండా ఊపి ప్రారంభించారు. 3 కి.మీ, 5 కి.మీల విభాగాల్లో జరిగిన ఈ రన్, సైక్లింగ్‌లో వేలాది మంది నగర వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ప్రేమ, స్నేహం, సేవా భావాలను పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీ, రాష్ట్ర అధ్యక్షుడు సత్య సాయి యూనివర్సల్ టార్చ్ ఆఫ్ పీస్(శాంతిజ్యోతి)ను చేతబూని ర్యాలీలో నడిచారు. 2025 నవంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన ఈ జ్యోతి.. 140 దేశాల్లో శాంతి, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముందు ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ పద్మిని రాజు జుంబా డ్యాన్స్‌తో, సత్య సాయి విద్యావిహార్ విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాల వాద్య బృంద ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సత్య సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, భారీ సంఖ్యలో యువత, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


