రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
ఉక్కునగరం: విధులకు వెళ్తున్న స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. వడ్లపూడి అప్పికొండ ఆర్‌హెచ్ కాలనీకి చెందిన జి.సంజీవరావు(41) స్టీల్‌ప్లాంట్ టీపీపీ విభాగంలో స్కిల్డ్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. సోమవారం యథావిధిగా బైక్‌పై విధులకు బయల్దేరాడు. సీఐఎస్‌ఎఫ్ యూనిట్ కాంప్లెక్స్ కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్ దాటే క్రమంలో ముందున్న బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో కింద పడి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఉద్యోగులు అతన్ని వెంటనే కారులో ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


