షిప్‌యార్డుల్లో 11 డ్రెడ్జర్ల నిర్మాణం
సాక్షి, విశాఖపట్నం : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తమ వంతు బాధ్యతగా 11 ఎకో ఫ్రెండ్లీ డ్రెడ్జర్లను భారతీయ షిప్‌యార్డుల్లో నిర్మిస్తున్నట్లు డీసీఐ ఎండీ కెప్టెన్ దివాకర్ వెల్లడించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 12,000 క్యూబిక్ మీటర్ల బీగల్ సిరీస్ డ్రెడ్జర్ అయిన డ్రెడ్జ్ గోదావరిని త్వరలో డీసీఐలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఇదే తరగతికి చెందిన మరో రెండు డ్రెడ్జర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రస్తుతం భారతదేశ డ్రెడ్జింగ్ అవసరాలలో 55 శాతం కంటే ఎక్కువగా నిర్వహిస్తున్న డీసీఐ.. ఫ్లీట్ ఆధునీకరణ, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. సాగర్‌మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్.. డీసీఐకి రూ.150 కోట్ల ఎన్‌బీఎఫ్‌సీ టర్మ్ లోనను అందించడంతో సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సంస్థలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులను సత్కరించారు. ఉద్యోగులకు నిర్వహించిన వ్యాస రచన, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీసీఐ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే ఉత్సవాల్లో
డీసీఐ ఎండీ కెప్టెన్ దివాకర్


