ఆరోగ్యానికి అభాయం
మహారాణిపేట: వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు విశాఖ కేంద్ర బిందువుగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అమలులో జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లాలో 9,11,697 మంది ఈ డిజిటల్ కార్డుల కోసం నమోదు చేసుకోగా, వారిలో 75.66 శాతం మంది ఈ–కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు.
ఏమిటీ ‘అభా’
గతంలో ఆసుపత్రికి వెళ్లాలంటే పాత రిపోర్టులు, స్కానింగ్ ఫిల్మ్స్, ప్రిస్కిప్షన్ల కట్టలు మోసుకెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ‘అభా’విధానాన్ని తీసుకొచ్చింది. ఇది 14 అంకెలు ఉండే ఒక విశిష్టమైన ఐడీ. బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకున్నట్లే, మన ఆరోగ్య సమాచారాన్ని ఇందులో డిజిటల్ రూపంలో భద్రపరచవచ్చు. దేశంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా ఈ ఐడీ చెల్లుబాటవుతుంది.
అందుబాటులో సేవలు
నెట్‌వర్క్: కేజీహెచ్, విక్టోరియా, ఈఎన్‌టీ, టీబీ ఆసుపత్రులతో పాటు అన్ని పీహెచ్‌సీలు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఈ విధానం అమలవుతోంది. సచివాలయాల్లో ఏఎన్‌ఎంల ద్వారా కూడా నమోదు చేస్తున్నారు.ఆధార్ కచ్చితంగా మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి.
బీమా సౌకర్యం: ఈ కార్డు ఉన్నవారికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించే అవకాశం ఉంటుంది.
ఈ–కేవైసీ తప్పనిసరి: కార్డు నమోదు చేసుకున్న తర్వాత ఈ–కేవైసీ పూర్తి చేస్తేనే కార్డులు జారీ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే ప్రక్రియ మరింత సులభమవుతుంది.
అభా వల్ల
ఎన్నో ప్రయోజనాలు
ప్రతి ఒక్కరూ అభా యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా వైద్య సేవలను సులభతరం చేసుకోవచ్చు. దీని వల్ల దేశంలో ఎక్కడైనా మన ఆరోగ్య రికార్డులను చూపించే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ బీమా ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఇప్పటికే ఈ నమోదు ప్రక్రియలో విశాఖ జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. రోగులు ఓపీ కోసం ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా ఈ డిజిటల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ కె.అప్పారావు, జిల్లా సమన్వయకర్త,
ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ
సులభమైన ఓపీ విధానం
స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్ నుంచి అభా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆధార్ వివరాలతో నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసుపత్రికి వెళ్లాక, అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా టోకెన్ నంబర్ వస్తుంది. దీనిని కౌంటర్లో చూపిస్తే ఓపీ చీటీ జారీ చేస్తారు. దీనివల్ల క్యూలో గంటల తరబడి నిలబడే శ్రమ తప్పుతుంది.


