పాత బిల్లులు ఇప్పుడెందుకు? | - | Sakshi
Sakshi News home page

పాత బిల్లులు ఇప్పుడెందుకు?

Jan 29 2026 6:02 AM | Updated on Jan 29 2026 6:02 AM

పాత బిల్లులు ఇప్పుడెందుకు?

పాత బిల్లులు ఇప్పుడెందుకు?

అసంపూర్తి వివరాలపై అధికారులను నిలదీసిన మేయర్‌

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజాధనం వినియోగం విషయంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు సూచించారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. స్థాయీ సంఘం సమావేశానికి హాజరయ్యేటప్పుడు, ఆయా పనులకు సంబంధించిన పూర్తి వివరాలు, నివేదికలతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆరు నెలలు, ఏడాది కిందట జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను ఇప్పుడు అజెండాలో చేర్చడం, సరైన వివరాలు లేకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. ఏ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? ఏ బిల్లులు పెడుతున్నారు అనే అంశాలపై స్పష్టత ఉండాలని, లేని పక్షంలో పాలనలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. వివరాలు అసంపూర్తిగా ఉన్న కారణంగా 12 అంశాలను వాయిదా వేశారు. సమావేశంలో మొత్తం 172 అంశాలు(159 సాధారణ, 13 టేబుల్‌ అజెండా) చర్చకు రాగా, మెజారిటీ అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి సుమారు రూ. 29.18 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపారు. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది జీతభత్యాలు, ఉద్యోగుల సర్వీసు అంశాలు, రెవెన్యూ విభాగానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించారు. సిబ్బంది జీతాలకు సంబంధించిన ఫైళ్లను ఇకపై నిర్ణీత సమయానికే అందజేయాలని మేయర్‌ ఆదేశించారు.

ఎస్‌ఈ గోవిందరావుకు ఘన నివాళి

ఇటీవల అకాల మరణం చెందిన జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్‌ జి.గోవిందరావు, భీమిలి జోన్‌ 2వ వార్డు కార్పొరేటర్‌ గాడు చిన్నకుమారి లక్ష్మీ భర్త గాడు అప్పలనాయుడు మృతి పట్ల స్థాయీ సంఘం మౌనం పాటించి సంతాపం తెలిపింది. విధి నిర్వహణలో ఉద్యోగులు ఒత్తిడికి గురికాకూడదని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మేయర్‌, సభ్యులు సూచించారు. గోవిందరావు రూపంలో ఒక మంచి అధికారిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యులు సేనాపతి వసంత, మొల్లి హేమలత, సాడి పద్మారెడ్డి, ఇతర సభ్యులు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌ కుమార్‌, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement