దంపతుల ఆత్మహత్యాయత్నం
రక్షించిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్
అగనంపూడి: కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన పంకజ్ దాస్ (27), మంజూ దాస్ (24) దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖకు వలస వచ్చి అగనంపూడిలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన దంపతులు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగనంపూడి సాయినగర్ కాలనీ ఎదురుగా ఉన్న రైలు పట్టాలపైకి చేరుకుని ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ‘112’కు సమాచారం అందించారు. వెంటనే బ్లూకోల్ట్ కానిస్టేబుల్ వీవీఎస్‌ఎస్ సాయితేజ అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలపై ఉన్న దంపతులను పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం వారికి ప్రాథమిక కౌన్సెలింగ్ నిర్వహించి, జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. సమయానికి చేరుకుని ఇద్దరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సాయితేజను ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు.


