డబ్బులిస్తే పాస్?
మహారాణిపేట: కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌లో నిర్వహిస్తున్న జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) వార్షిక పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అధికారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ దొరికిపోవడంతో వారిని డిబార్ చేశారు. అయినప్పటికీ మాస్ కాపీయింగ్ ఆగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జీఎన్‌ఎం వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లలో ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. కేజీహెచ్‌లో జరుగుతున్న పరీక్షల్లో మొదటి, రెండో ఏడాది నుంచి 1,200, మూడో ఏడాది నుంచి 800 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే పరీక్షల నిర్వహణ తీరు, మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ నర్సింగ్ కౌన్సిల్ డైరెక్టర్ సునీత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థిలను గుర్తించి డిబార్ చేశారు.
జీఎన్‌ఎం కోర్సు ప్రాధాన్యత : జీఎన్‌ఎం అనేది మూడున్నర ఏళ్ల డిప్లమో కోర్సు. ఇందులో మూడేళ్ల విద్యాభ్యాసం తర్వాత ఆరు నెలల పాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్య సంరక్షణ, పోస్ట్ ట్రామాటిక్ కేర్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుకే ఈ కోర్సు పూర్తి చేయడానికి కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు.
అధ్యాపకులపై ఆరోపణలు : ఈ పరీక్షల నిర్వహణలో కొంతమంది అధ్యాపకుల పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినులను ఉత్తీర్ణులు చేస్తామని నమ్మబలికి, కాపీయింగ్‌కు సహకరించేందుకు కొంతమంది సిబ్బంది పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష హాల్‌లోనే విద్యార్థులకు సహకరించడం, మొబైల్ ఫోన్లు లేదా చిట్టీల ద్వారా సమాచారాన్ని అందించడం వంటి అక్రమా లు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. కాగా.. ఈ ఆరోపణలను ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ బి.మంగాదేవి ఖండించారు. పరీక్షలు పారదర్శకమైన వాతావరణంలో జరుగుతున్నాయని, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్‌లను కూడా నియమించామని, ఎటువంటి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు.


