481 మంది అక్రిడిటేషన్ల జారీకి కమిటీ ఆమోదం
విశాఖ సిటీ: జిల్లాలోని అర్హులైన 481 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో గురువారం కమిటీ సమావేశం జరిగింది. ముందుగా కన్వీనర్, సమాచార శాఖ ఉప సంచాలకుడు కె.సదారావు అజెండా అంశాలను కమిటీకి వివరించారు. సమావేశంలో 512 ప్రతిపాదించగా.. 481కి కమిటీ ఆమోదం తెలిపింది. వివిధ కారణాలతో 31 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పి.సత్తిబాబు, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహన లక్ష్మీ, రైల్వే పీఆర్వో జయరాం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


