త్రివర్ణం
సగర్వం..
జాతీయ పతాకాన్ని
ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్, చిత్రంలో సీపీ బాగ్చి, జేసీ విద్యాధరి
మహారాణిపేట : పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాంతత్య్ర సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా.. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. శాంతికి చిహ్నం, జాతి సమైక్యతను చాటి చెబుతూ కలెక్టర్, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు.
అభివృద్ధి పథంలో విశాఖ
విశాఖ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. రబీ సీజన్‌లో ఇంత వరకు 740 హెకార్టులో వివిధ పంటలు సాగు చేస్తున్నారని, రైతు సేవ కేంద్రాల ద్వారా ఈ రబీ సీజన్‌లో 83 క్వింటాళ్లు విత్తనాలు 673 మంది రైతులకు సరఫరా చేశామన్నారు. ఈ ఏడాది 450 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులను మంజూరు చేసి, 90 మంది కౌలు రైతులకు రూ.57 లక్షలు రుణంగా అందించామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 25,500 కుటుంబాల్లో 34,700 మంది వేతనదారులకు 13 లక్షల పనిదినాలు కల్పించడం ద్వారా రూ.36 కోట్ల వేతనాలను నేరుగా ఖాతాల్లో చెల్లించామన్నారు. జిల్లాలో 12,175 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల ద్వారా రూ.33.4 కోట్ల పెట్టుబడితో స్థాపించిన పరిశ్రమల్లో 15,920 మంది ఉపాధి కల్పించామన్నారు. సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను వివరిస్తూ డీఆర్డీఏ, జీవీఎంసీ–యూసీడీ, సమగ్ర శిక్షా, పశుసంవర్థక శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖలు, ఏపీఎంఐపీ, డ్వామా, మత్స్యశాఖ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్టాళ్లను సందర్శించిన కలెక్టర్ వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, న్యాయ, పోలీసు, రెవెన్యూ అధికారులు, రాజకీయ ప్రతినిధులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన రిప్లబిక్ దినోత్సవ కార్యక్రమంలో వి.అముల్య, చిత్ర హాసిని, యు.లాస్య అస్వస్థతకు గురయ్యారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్నకలెక్టర్ హరేందిర ప్రసాద్,
పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
త్రివర్ణం


