ఎంఎస్‌ఎంఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ రతన్‌కుమార్
అల్లిపురం: ఎంఎస్‌ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ. రతన్‌కుమార్ అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ రుణ ప్రోత్సాహక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి సృష్టి, స్థానిక వ్యాపారాల అభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎంఎస్‌ఎంఈ వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించడంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందుంటుందన్నారు. సరైన మార్గదర్శకత్వం, అనుకూలమైన రుణ పథకాల ద్వారా వ్యాపారుల ఎదుగుదలకు బ్యాంక్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు డి.వి.ఎస్.ఆర్. మూర్తి (అసిస్టెంట్ డైరెక్టర్, ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీస్), ఆదిశేషు (జనరల్ మేనేజర్, డీఐసీ) పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సబ్సిడీలు, వాటి అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలపై అధికారులు వివరించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డా. బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం జిల్లాల పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల నుంచి పాల్గొన్న కస్టమర్లకు మొత్తం రూ.94.22 కోట్ల విలువైన ఎంఎస్‌ఎంఈ రుణ మంజూరు పత్రాలను అందజేశారు.


