కంచిపీఠం పాఠశాల ప్రవేశాలకు విశేష స్పందన
సీతంపేట: భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాలల ప్రవేశాల ప్రక్రియకు విశేష స్పందన లభించింది. ఆదివారం స్థానిక శంకరమఠంలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మి మాంధాత మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని పెంపొందించడం, భావి తరాలకు అందించడం కోసం బ్రాహ్మణ బాలికలకు సంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు సమగ్ర విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికే కాకుండా, అన్ని కులాల వారికి వారి వృత్తుల్లో నైపుణ్య శిక్షణతో పాటు విద్యావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రం, కోర్సు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నామన్నారు.


