మూడు నెలలకోసారి జాబ్ మేళా
బీచ్‌రోడ్డు: విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒక సారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు వారికి తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. సాధారణ పౌరులకు దీటుగా అన్ని రకాల కార్యకలాపాల్లో ఉత్సాహంగా వ్యవహ రిస్తున్న విభిన్న ప్రతిభావంతుల పని తీరు ప్రశంసనీయమని, వారి నడక, నడత అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. ఇటీవల జరిగిన అంధుల వరల్డ్ క్రికెట్ కప్‌ను భారత్ జట్టు గెలుచుకుందని, ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి కీలక ప్రదర్శనతో ఆకట్టుకుందన్నారు. అంగవైకల్యం ఉన్నవారు కుంగిపోకుండా ప్రతి ఒక్కరూ కరుణ కుమారిలా ఎదగాలని పిలుపునిచ్చారు.
‘ఈగో’ అనే వైకల్యాన్ని వీడాలి
అంగవైకల్యం కలిగిన చిన్నారుల ప్రతిభను చూసి చాలా ముచ్చటేసిందని, వారి నైపుణ్యం నిజంగా అబ్బురపరిచిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. శారీరక వైకల్యం ఉన్నా వీరిలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని, కానీ సాధారణ పౌరుల్లో మాత్రం ‘ఈగో’ అనే మానసిక వైకల్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చిన్నారుల ప్రతిభను చూశాక వారంతా ‘ఈగో’అనే వైకల్యాన్ని తప్పక పోగొట్టుకోవాల్సి ఉంటుందని హితవు పలికారు. సంజ్ఞా భాష గురించి సాధారణ పౌరులు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, కనీసం తల్లిదండ్రులైనా కచ్చితంగా తెలుసుకుంటేనే విభిన్న ప్రతిభావంతులకు తగిన విధంగా సహాయపడగలమన్నారు.
521 మందికి ప్రశంసాపత్రాల అందజేత
కార్యక్రమంలో భాగంగా యూసీడీలో రెండు ప్రత్యేక బృందాలకు రూ.13 లక్షల విలువ గల చెక్కును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితో కలిసి కలెక్టర్ అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన 521 మందికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె. కవిత, యూసీడీ పీడీ సత్యవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, సీపీవో శ్రీనివాసరావు, ఏపీసీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, వికలాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మూడు నెలలకోసారి జాబ్ మేళా


