నేను యావరేజ్ స్టూడెంట్‌నే..
ఇంటర్‌లో కోరుకున్న కాలేజీలో
సీటు రాలేదు..
ఉద్యోగం, వ్యాపారం చేస్తూనే
సివిల్స్ కొట్టా..
పరాజయాలకు కుంగిపోవద్దు..
లక్ష్యాన్ని వదలొద్దు
కలెక్టర్ హరేందిరప్రసాద్ సూచన
సీతంపేట: తరగతి గదిలో ఒక సగటు విద్యార్థి కూడా ఐఏఎస్ అధికారిగా ఎదగగలడని చెప్పడానికి తన జీవితమే నిదర్శనమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. బుధవారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ సివిల్స్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తన విద్యార్థి దశ నుంచి ఐఏఎస్ సాధించే వరకు సాగిన ప్రయాణాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను విద్యార్థులతో పంచుకున్నారు.
పదిలో 79 శాతమే..
‘మా తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. అయినప్పటికీ నాకు పదో తరగతిలో వచ్చింది 79.4 శాతం మార్కులే. ఆ పర్సంటేజీకి నేను కోరుకున్న టాప్ కాలేజీలో ఇంటర్ సీటు రాలేదు. దీంతో మా అక్క చదివిన కాలేజీలోనే చేరాల్సి వచ్చింది. తమిళనాడులోని అమృత కళాశాలలో ఇంజినీరింగ్, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి విప్రోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాను. కానీ, వేల మందిలో ఒకడిగా పని చేయడం నాకు సంతృప్తినివ్వలేదు. స్నేహితులతో కలిసి బిజినెస్ కూడా ప్రారంభించా.,’అని కలెక్టర్ తన గతాన్ని వివరించారు.
ఉద్యోగం, వ్యాపారం చేస్తూనే..
తన స్నేహితుడు ఎంబీఏ చేస్తూనే సివిల్స్‌లో విజయం సాధించడం తనకు స్ఫూర్తినిచ్చిందని కలెక్టర్ తెలిపారు. ‘నా వల్ల ఎందుకు కాదు? అని ప్రశ్నించుకుని 2010లో సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఒకపక్క జాబ్ చేస్తూ, మరోపక్క బిజినెస్ చూసుకుంటూనే.. 2014లో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేశా..’అని తన విజయ రహస్యాన్ని వివరించారు.
లక్ష్యాన్ని వదలొద్దు..
లక్ష్యం కోసం ప్రణాళికాబద్ధంగా శ్రమించాలని, పరాజయం ఎదురైనా నిరాశ చెందకుండా విజయం సాధించే వరకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు. పౌరగ్రంథాలయంలో చదువుకోవడానికి మంచి వాతావరణం, సౌకర్యాలు ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయ నిర్వహణ అద్భుతంగా ఉందని పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి డి.ఎస్.వర్మ, సహ కార్యదర్శి డాక్టర్ డి.వి.సూర్యారావు తదితరులు కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు.


