ఏసీబీకి చిక్కిన గాజువాక ఏఎస్‌వో
గాజువాక : పౌరసరఫరాల శాఖ సర్కిల్–3 ఏఎస్‌వో టి.కృష్ణ రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆరు నెలల క్రితం సీజ్ చేసిన రెండు ఆటోలను విడుదల చేసే విషయంలో లంచం డిమాండ్ చేసిన ఆయన్ని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త గాజువాకకు చెందిన నారాయణ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నాడన్న సమాచారంతో ఏఎస్‌వో కృష్ణ దాడి చేసి రెండు ఆటోలను సీజ్ చేశారు. వాటిని న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. తన వాహనాలను విడిచి పెట్టాలని నారాయణ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. వాహనాలను విడిచిపెట్టాలని జాయింట్ కలెక్టర్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆటోలను విడిచిపెట్టాల్సిందిగా జాయింట్ కలెక్టర్ గాజువాక ఏఎస్‌వోను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ఆ వాహనాలను విడుదల చేయాల్సిందిగా ఏఎస్‌వో టి.కృష్ణ న్యూపోర్టు పోలీస్ స్టేషన్ అధికారికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆయన బాధితుడు నారాయణను రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు నెలరోజులుగా ఏఎస్‌వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు, ఏఎస్‌వోకు నారాయణ రూ.10వేలు లంచం ఇస్తున్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అధికారిని నగరంలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం హాజరుపరచనున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
రూ.10 వేలు లంచం తీసుకుంటూ
పట్టుబడిన అధికారి


