పాఠశాల బస్సులపై ప్రత్యేక నిఘా
గోపాలపట్నం: జిల్లాలోని పాఠశాల, కళాశాల బస్సులు తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఉప రవాణా కమిషనర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం రవాణా శాఖ అధికారులు, పోలీసులతో కలిసి పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. బస్సుల్లో స్పీడ్ లిమిట్ పరికరాలు, అగ్నిమాపక యంత్రాలు, హ్యాండ్ బ్రేక్, సర్వీస్ బ్రేక్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలతో కూడిన చెక్ లిస్టులను ఆయా యాజమాన్యాలకు అందించి, వారం రోజుల్లోగా వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. అనంతరం డ్రైవర్లకు, స్కూల్ సిబ్బందికి, సేఫ్టీ కమిటీ సభ్యులకు భద్రతపై అవగాహన కల్పించా రు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల భద్రత గురించి వివరించారు. పాఠశాలల్లో పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో తరచూ అవగాహన కార్యక్రమాలు చేపడతామని, బస్సుల తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.


