ఎల క్ట్రానిక్స్‌ రాజధాని | - | Sakshi
Sakshi News home page

ఎల క్ట్రానిక్స్‌ రాజధాని

Dec 6 2025 7:45 AM | Updated on Dec 6 2025 7:45 AM

ఎల క్ట్రానిక్స్‌ రాజధాని

ఎల క్ట్రానిక్స్‌ రాజధాని

● తమిళనాడేనన్న సీఎం స్టాలిన్‌ ● శ్రీపెరంబదూరులో అమెరికా పెట్టుబడి ● రూ.1003 కోట్లతో పరిశ్రమ

భారతదేశంలో ఎలక్ట్రానిక్స్‌ రాజధానిగా

తమిళనాడు అవతరించిందని సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. రూ.1003 కోట్ల పెట్టుబడితో 840 మందికి ఉపాధి కల్పిస్తూ అమెరికాకు చెందిన కార్నింగ్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ వెంచర్‌గా భారత్‌ ఇన్నోవేటివ్‌ గ్లాస్‌ టెక్నాలజీస్‌ పరిశ్రమను సీఎం స్టాలిన్‌ శుక్రవారం ప్రారంభించారు. కాంచీపురం జిల్లాలోని పిళ్లైపక్కంలోని పారిశ్రామిక పార్కులో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల కోసం గాజు ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా ఈ పరిశ్రమను నెలకొల్పారు.

– సాక్షి, చైన్నె

2030 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు లక్ష్యంగా పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను పారిశ్రామిక వాడలలో కల్పిస్తూ వస్తున్నారు. అన్ని జిల్లాలోని పారిశ్రామిక అభివృద్ధి మెరుగు పరిచే విధగా విస్తృత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాజాగా అమెరికన్‌ సంస్థ పరిశ్రమ నిర్మాణ పనులను ముగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ పరిశ్రమను సీఎం స్టాలిన్‌ ఆవిష్కరించారు. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. యువతకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. దేశంలోనే మొట్టమొదటి పరిశ్రమగా ప్రెసిషన్‌ గ్లాస్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి, ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌తోపాటుగా మంత్రి అన్బరసన్‌, ఎమ్మెల్యే సెల్వ పెరుంతొగై, పరిశ్రమల శాఖ కార్యదర్శి వి.అరుణ రాయ్‌, గైడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అలర్మేల్‌మంగై, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ కయల్వెలి సెల్వరాజ్‌, ఆ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఆండ్రూ బెక్‌, రవికుమార్‌, జోయ్‌ లీ, ఐసీఈఏ అధ్యక్షుడు పంకజ్‌ మోహింద్రా, ఆప్టిమస్‌ చైర్మన్‌ అశోక్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్స్‌ రాజధాని

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ మాట్లాడారు. భారత్‌ ఇన్నోవేటివ్‌ గ్లాస్‌ టెక్నాలజీస్‌–కార్నింగ్‌

ఆప్టిమస్‌ పార్టనర్‌షిప్‌ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ మరింత అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుందని వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు యువతకు ఉన్నత, నాణ్యతతో కూడిన ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. గత సంవత్సరం జనవరిలో ఈ ప్రాజెక్టు కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని, తాజాగా అమల్లోకి తీసుకొచ్చి, ఉత్పత్తికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటి వరకు జరిగిన అవగాహన ఒప్పందాలలో 80 శాతం వివిధ దశలలో ఉన్నాయని వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్‌, జీసీసీ, ఆర్‌ అండ్‌ డీ వంటి రంగాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 14.65 బిలియన్ల విలువైన వస్తువుల ఎగుమతులలో దేశంలోనే తమిళనాడు నెంబర్‌ ఒన్‌గా అవతరించిందన్నారు. భారతదేశ ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో తమిళనాడు వాటా 41 శాతంగా ఉన్నట్టు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో ఈ రంగం 9 రెట్లు వృద్ధిని సాధించామన్నారు. ఇది కేవలం డేటా మాత్రమే కాదని, ఇది తమిళనాడును భారతదేశానికే ఎలక్ట్రానిక్స్‌ రాజధానిగా మార్చిందన్నారు. దీనిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మరిన్ని సంస్థలు రాబోతున్నాయని వివరించారు. అంతే కాదు సెమీకండక్టర్‌ తయారీ, రూపకల్పన రంగాలపై కూడా దృష్టిని విస్తృతం చేస్తున్నామని ప్రకటించారు. గత ఏడాది సెమీకండక్టర్‌ మిషన్‌–2030ని ప్రకటించామని, సెమీకండక్టర్‌, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌ పాలసీలను కూడా విడుదల చేశామని వివరించారు.

యువతకు ఉద్యోగాలు

తమిళనాడు అభివృద్ధి అందరికీ సమతులమని, అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లే విధంగా ప్రాజెక్టులపై దృష్టి పెట్టామన్నారు. ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల ప్రణాళికలకు సంబంధించి,

కాంచీపురం–హోసూర్‌–కోయంబత్తూర్‌–తిరుచ్చి – తిరునెల్వేలి తదితర అన్నీ ప్రాంతాలలో ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల ప్రాజెక్టులు నెలకొల్పామని గుర్తు చేశారు. తూత్తుకుడిలో ఎలక్ట్రానిక్‌ తయారీ సముదాయంను స్థాపించామన్నారు. భవిష్యత్తులో ఇక్కడకు మరింతగా పెట్టుబడులు రావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. తద్వారా యువతకు మరింతగా ఉద్యోగాలు దక్కబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement