లోక్‌సభకు దీపం రచ్చ
తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే వివాదం శుక్రవారం లోక్‌సభకు చేరింది. జస్టిస్ స్వామినాథన్ ఉత్తర్వులు తమిళనాట మత కల్లోలాలకు దారి తీస్తున్నాయంటూ డీఎంకే కూటమి సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపును తిరుప్పరకుండ్రం వాసులు తిరస్కరించారు. ఇక, కోర్టు ధిక్కార కేసుల విచారణలు వాయిదా పడ్డాయి. – సాక్షి, చైన్నె
మదురై జిల్లా తిరుప్పర కుండ్రం మురుగన్ ఆలయ కొండపై కార్తీక దీపం వెలిగింపునకు సంబంధించిన వ్యవహారం గత రెండు రోజులుగా ఉత్కంఠను రేపుతూ వస్తున్న విషయం తెలిసిందే. మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ రెండు సార్లు ఇచ్చిన ఉత్తర్వులతో కొండపైకి బీజేపీ వర్గాలు, హిందూ సంఘాలు దూసుకెళ్లే ప్రయత్నం చేయడం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గురువారం జరిగిన నిరసనకు సంబంధించి పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, సీనియర్‌నేత రాజాలతో పాటుగా అనేక మందిపై ఏడు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం, పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ, హిందూ సంఘాలు శుక్రవారం తిరుప్పరకుండ్రం బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే అక్కడి ప్రజలు స్పందించలేదు. యథాప్రకారం తమ దుకాణాలను తెరచి ఉంచారు. దుకాణాలు మూసి వేయాలంటూ నిరసనకారులు ఆదేశించినా ఖాతరు చేయలేదు. అదే సమయంలో తిరుప్పరకుండ్రంలో స్థానికేతరుల రూపంలోనే వివాదాలు మొదలయ్యాయని, స్థానికేతరులను తమ గ్రామంలోకి అనుమతించవద్దంటూ అక్కడి ప్రజలు నినాదాలు చేయడం గమనార్హం.
లోక్‌సభకు వ్యవహారం
తిరుప్పరకుండ్రం వ్యవహారం లోక్‌సభకు చేరింది. జస్టిస్ స్వామినాథన్ ఉత్తర్వులతో తమిళనాట మత కల్లోల పరిస్థితులు కల్పించి ఉన్నాయని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈసమయంలో డీఎంకే, బీజేపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్ తన ప్రసంగంలో డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఈ వ్యవహారం వాడివేడిగా సాగడంతో చివరకు డీఎంకేతోపాటుగా రాష్ట్రానికి చెందిన ఆ కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. చిన్న గ్రామంలో మొదలైన వివాదం, మధురై ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులతో రాజకీయ వివాదంగా మారింది. జాతీయ స్థాయిలోకి ఈ వ్యవహారం లోక్‌సభకు సైతం చేరడం చర్చకు దారి తీసింది. ఇక కార్తీక దీపం వెలిగింపు వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కార కేసు విచారణ 9వ తేదికి మధురై ధర్మాసనంలో వాయిదా పడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను ఈనెల 12న విచారించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో సైతం రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. తాజా పరిస్థితులపై సీఎం స్టాలిన్ ఎక్స్‌పేజీలో స్పందిస్తూ, మదురైకు అవశ్యం అభివృద్ధినా రాజకీయమా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యలు చేశారు.
ఇక స్వామినాథన్‌ను జడ్జి పదవి నుంచి తప్పించాల్సిందేనన్న నినాదంతో జరిగిన నిరసనలో సీపీఎం నేత షణ్ముగం స్పందించారు. మతతత్వ శక్తుల కుట్రల్ని అడ్డుకుంటామన్నారు. తమిళనాడులో మత కల్లోలాకు కుట్ర జరుగుతున్నదని ఎండీఎంకే నేత వైగో, కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగైలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ స్పందిస్తూ అన్బే శివం.. అరివే బలం అని వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుప్పరకుండ్రం పరిసరాలలో పోలీసు భద్రతను మరింతగా పెంచారు.


