అమిత్ షాతో అన్నామలై
న్యూస్‌రీల్
సాక్షి, చైన్నె: కేంద్రహోం మంత్రి అమిత్‌షా పిలుపుతో హుటాహుటీన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్ర రాజకీయాలపై సమగ్ర వివరాలను అన్నామలై సమర్పించారు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినానంతరం అన్నామలై పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. ముఖ్య నేతలు వచ్చిన సందర్భంలో కలుసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో తిరుప్పూర్‌లో జరగాల్సిన ఓ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో అమిత్ షా నివాసానికి ఆయన వెళ్లారు. ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌లను అన్నామలై కలిశారు. తమిళనాట బీజేపీ 62 స్థానాలలో బలంగా ఉందని, అయితే, ఎన్నికలను ఎదుర్కొనే స్థాయిలో బూత్ కమిటీలు ఇంకా ఏర్పాటు కాలేదన్నట్టుగా వివరాలను సమర్పించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుత కూటమిని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తే ఆశించిన ఫలితాలు కష్టమేనని, అయితే, కూటమిలోని పీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, డీఎండీకే తదితర పార్టీలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందన్న సమగ్ర వివరాలను అమిత్‌షాకు అన్నామలై అందజేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో తిరుప్పరకుండ్రం వ్యవహారంపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు చెబుతున్నారు.
విజయ్ పక్షాన నాంజిల్ సంపత్
– టీవీకేలోకి చేరిక
సాక్షి, చైన్నె: సీనియర్ రాజకీయ నాయకుడు నాంజిల్ సంపత్ శుక్రవారం తమిళగ వెట్రి కళగంలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. తమిళనాట అందరికీ సుపరిచితుడు నాంజిల్ సంపత్. మంచి వాక్ చాతుర్యం, సందర్భానుచిత వ్యాఖ్యల తూటాల్ని పేల్చడంలో దిట్ట. ఏళ్ల తరబడి వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు పట్టుగొమ్మగా ఉన్న నాంజిల్ సంపత్ గతంలో బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అమ్మ జయలలిత జీవించి ఉన్న కాలంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చీ రాగానే, నాంజిల్ సంపత్‌కు పెద్ద బాధ్యతల్నే జయలలిత అప్పగించారంటే.. ఆయన వాక్ ధాటి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ సిద్ధాంతాల ప్రచార సంయుక్త కార్యదర్శి పదవిని కట్టబెట్టడమే కాకుండా, ప్రచార రథంగా ఓ ఇన్నోవా కారును సైతం ఆయనకు కానుకగా అందజేశారు. అయితే అమ్మ జయలలిత మరణంతో పార్టీ వ్యవహారాలకు నాంజిల్ దూరంగానే ఉంటూ వచ్చారు. చివరకు ఇన్నోవా కారును కూడా అప్పగించేసి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన తాజాగా విజయ్ పక్షాన చేరడం గమనార్హం. గత వారం అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత సెంగొట్టయ్యన్ విజయ్ పక్షాన చేరి కీలక బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే.
అమిత్ షాతో అన్నామలై


