9న పుదుచ్చేరికి విజయ్!
పుదుచ్చేరిలో పర్యటించేందుకు తమిళగ
వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రెడీ అయ్యారు. ఈనెల 9వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు.
సాక్షి, చైన్నె: రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా పుదుచ్చేరిలో శుక్రవారం పర్యటించేందుకు విజయ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. భారీ ర్యాలీ, రోడ్ షో ద్వారా బహిరంగ సభకు నిర్ణయించారు. అయితే ర్యాలీ, రోడ్ షోకు అనుమతి అన్నది ఇవ్వలేదు. కేవలం బహిరంగ సభకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో పుదుచ్చేరిలోనూ వర్షాలు పడుతుండడంతో తన పర్యటనను విజయ్ వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో పుదుచ్చేరి సీఎం రంగస్వామితో టీవీకే ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ బుధవారం భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. బీజేపీ రూపంలో తీవ్ర ఇరకాటంలో పడ్డ రంగస్వామి వ్యూహాలకు సంబంధించి కొత్త చర్చ అన్నది బయల్దేరింది. ఈ పరిస్థితులలో 9వ తేదీన పుదుచ్చేరిలో భారీ బహిరంగ సభకు విజయ్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కసరత్తులలో పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి.
కాంగ్రెస్‌తో మళ్లీ చర్చలు
డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌తో విజయ్ సంప్రదింపులలో ఉన్నట్టుగా ఇప్పటికే ఓ చర్చ తెరమీదకు వచ్చింది. ఇందుకు ముగింపు పలికే ప్రయత్నాలు సైతం సాగాయి. అదే సమయంలో కాంగ్రెస్ కమిటీ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు తాము ఆశిస్తున్న నియోజకవర్గాల జాబితా వివరాలను అందజేసి వెళ్లింది. ఇందులో 70 సీట్లను కాంగ్రెస్ ఆశిస్తుండడంతో డీఎంకే డైలమాలో పడి ఉంది. అదే సమయంలో విజయ్‌తో కాంగ్రెస్ వర్గాలు మళ్లీ టచ్‌లోకి వెళ్లినట్టుగా శుక్రవారం చర్చ తెర మీదకు వచ్చింది. విజయ్ తండ్రి ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో ఓ వివాహ వేడుకలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రత్యేకంగా మాట్లాడడం చర్చకు బలాన్ని చేకూర్చినట్టైంది. విజయ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లే దిశగా ఈ సంప్రదింపు సందర్భంగా కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. అదే సమయంలో విజయ్‌తో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారాలు వెలువడడం హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త చర్చ
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సీఎంగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ఉన్నారు. అధికారంలో బీజేపీకి వాటా సైతం ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల రూపంలో రంగస్వామికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. అలాగే అనేక పథకాలు అమలుకు నోచుకోక పోవడంతో తీవ్ర మనస్తాపంతో పదవిలో కొనసాగుతున్నట్టుగా గతంలో చర్చ సాగింది. తాజాగా విజయ్ రాజకీయ ప్రయాణం పుదుచ్చేరిలోనూ మొదలు కానుండడంతో ఈ సారి ఎన్నికలలో బీజేపీని పక్కన పెట్టే వ్యూహంతో రంగస్వామి ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. విజయ్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతో టీవీకేతో కలిసి 2026 ఎన్నికలను ఎదుర్కొనేందుకు రంగన్న వ్యూహాలకు పదును పెట్టినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా భుస్సీ ఆనంద్‌ను తనను కలిసేందుకు రంగస్వామి అనుమతి ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ రూపంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న రంగస్వామి తాజాగా రూటు మార్చడం ఖాయమని పేర్కొంటున్నారు. త్వరలో విజయ్‌తో ఆయన సంప్రదింపులు జరపవచ్చునని, ఈసారి విజయ్ పర్యటన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో పుదుచ్చేరిలో సాగవచ్చు అన్న చర్చ జోరందుకుంది.


