అమ్మకు అంజలి
సాక్షి, చైన్నె : దివంగత సీఎం, అన్నాడీఎంకే వర్గాల అమ్మ జె.జయలలిత 9వ వర్థంతి కార్యక్రమాలు శుక్రవారం రాష్ట్రంలో వాడవాడలా పోటా పోటీగా జరిగాయి. మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు అన్నాడీఎంకే వర్గాలు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. పురట్చితలైవి, అమ్మ జె.జయలలిత అందరినీ వీడి అనంతలోకాలకు వెళ్లి 9 సంవత్సరాలు అవుతోంది. దీంతో ఆమె వర్థంతి సందర్భంగా మెరీనా తీరంలోని సమాధి వద్దకు ఉదయాన్నే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి నేతృత్వంలో మాజీ మంత్రులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. వాడవాడలా జయలలిత చిత్ర పటాల్ని పార్టీ వర్గాలు కొలువుదీర్చాయి. విగ్రహాలకు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. కొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ ప్రసంగాల్ని హోరెత్తించారు. సమాధి వద్ద నివాళులర్పించినానంతరం పార్టీ బలోపేతం దిశగా, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఆశయ సాధనే లక్ష్యంగా, రానున్న 2026లో అన్నాడీఎంకే గుప్పెట్లోకి అధికారం లక్ష్యంగా, అభ్యర్థుల గెలుపు ధ్యేయంగా నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అందరితో పళణి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నేత కేపీ మునుస్వామి, దిండుగల్ శ్రీనివాసన్, కామరాజర్, వలర్మతి, గోకుల ఇందిరా, విజయ భాస్కర్, ఎస్పీ వేలుమణి, పొల్లాచ్చి వి.జయరామన్, సత్య, సెమ్మలై, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పెట్టబోను
దివంగత అమ్మ జయలిత సమాధి వద్ద మాజీ సీఎం పన్నీరు సెల్వం తన మద్దతు దారులతో వచ్చి అంజలి ఘటించారు. కాసేపు మౌనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీపై ప్రస్తావిస్తూ, రాజకీయ చర్చ జరిగిందని, అన్నీ మంచే జరగాలని ఎదురు చూద్దామన్నారు. తాను కొత్తగా ఎలాంటి పార్టీ పెట్టబోనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగానే చిరునవ్వుతో ముందుకెళ్లారు. అనంతరం దివంగత నేత జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అంజలి ఘటించారు. జయలలిత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పెద్ద ఎత్తున కేడర్ తరలి రావడంతో అమ్మ సమాధి పరిసరాలు కిటకిటలాడాయి. ఇక అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, అమ్మ నెచ్చెలి, చిన్నమ్మ శశికళ మద్దతుదారుల నేతృత్వంలో వర్థంతి సేవా కార్యక్రమాలు జరిగాయి.
అమ్మకు అంజలి


