
రహదారి భద్రతను, మౌలిక సదుపాయాల నాణ్యతను గణనీయంగా పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కవర్ చేస్తూ అధునాతన 3డీ సెన్సార్లు, డేటా సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది.
సాంకేతికతతో పర్యవేక్షణ
ఈ ప్రాజెక్టులో భాగంగా రహదారుల ఉపరితల లోపాలను (గుంతలు, పగుళ్లు వంటివి) అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ప్రత్యేకంగా అమర్చిన వాహనాలను ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాటు చేయనుంది. ఈ వాహనాల్లో 3డీ లేజర్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థలు సిద్ధం చేస్తుంది. ఇందులో గుర్తించిన లోపాలను ఇనెర్షియర్ మెజర్‌మెంట్ యూనిట్స్(IMU) ద్వారా జియోట్యాగ్ చేయడానికి జీపీఎస్ (GPS) ఉంటుంది. ఈ టెక్నాలజీల సాయంతో రియల్‌టైమ్ డేటా సేకరిస్తూ దాన్ని విశ్లేషించే వీలుంటుంది. దాని ద్వారా సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుంది.
డేటా లేక్
ఇలా సేకరించిన మొత్తం డేటా ఎన్‌హెచ్‌ఏఐ ఏఐ ఆధారిత పోర్టల్ ‘డేటా లేక్’లో అప్‌లోడ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఆ డేటాను విశ్లేషించి కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ డేటా ఆధారిత విధానం రహదారి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. సేకరించిన డేటాను ప్రామాణిక ఫార్మాట్లలో భద్రపరచనున్నారు. ఇది దీర్ఘకాలిక సాంకేతిక, ప్రణాళిక ప్రయోజనాలకు తోడ్పడుతుంది.
భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు అభివృద్ధి పనులకు ముందే డేటా సేకరణ ప్రారంభమవుతుంది. ఆరు నెలలపాటు ఇది కొనసాగుతుంది. రెండు నుంచి ఎనిమిది లేన్ల రహదారులతో కూడిన అన్ని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది.
ఇదీ చదవండి: గూగుల్‌కు పోటీగా ఓపెన్‌ఏఐ కొత్త బ్రౌజర్