ఆర్‌ఆర్‌ఆర్‌ నం.161ఏఏ | Key progress has been made on the northern part of the Regional Ring Road | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ నం.161ఏఏ

Oct 15 2025 5:07 AM | Updated on Oct 15 2025 5:07 AM

Key progress has been made on the northern part of the Regional Ring Road

రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి కేటాయింపు?

ఆ భాగానికి కీలక ప్రాజెక్ట్‌ అప్రైజల్‌ అండ్‌ స్క్రూటినీ కమిటీ క్లియరెన్స్‌

నవంబరులో తెరుచుకోనున్న టెండర్లు

ఆ వెంటనే నిర్మాణ పనులకు శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌ :  రీజినల్‌ రింగురోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించి కీలక పురోగతి చోటుచేసుకుంది. ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ అప్రైజల్‌ అండ్‌ టెక్నికల్‌ స్క్రూటినీ కమిటీ (పీఏటీఎస్‌సీ) ఆమోదించింది. ఇది ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సంబంధమైన సాధ్యాసాధ్యాలను అంచనా వేసి పరిశీలించి లోపాలను ఎత్తిచూపి వాటిని సరిదిద్దిన తర్వాత ఆమోదముద్ర వేస్తుంది. దాని ఆమోదం తర్వాతనే కీలక పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదముద్ర లభిస్తుంది. 

దానికి కేంద్ర కేబినెట్‌ ఆర్థిక వ్యవహారాల కమిటీ పచ్చజెండా ఊపుతుంది. తాజాగా రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగం సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాల అప్రైజల్‌ను పూర్తి చేసుకుని పీపీపీఏసీ ఆమోదముద్రకు వెళ్లింది. త్వరలో ఆ కమిటీ కూడా సమావేశమై దీనికి తుది అనుమతి ఇవ్వనుంది. మరో పక్షం/నెల రోజుల్లో స్పష్టత రానున్నట్టు తెలిసింది. ఆ వెంటనే టెండర్లు తెరిచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

నవంబరులో ఉత్తర భాగం టెండర్లను తెరవను న్నారు. అప్పటికి రోడ్డుకు జాతీయ రహదారి నంబరు రావాల్సి ఉంది. దీంతో దీనికి ఎన్‌హెచ్‌ 161ఏఏ నంబరును కేటాయించనున్నారని తెలిసింది. ఎన్‌హెచ్‌ 161ఏఏ ఎన్‌ఈ (నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌వే)గా రికార్డుల్లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆ నంబరును సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకు ఉన్న రోడ్డుకు ఉంది. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న ఆ రోడ్డును రీజినల్‌ రింగురోడ్డు ప్రతిపాదన సమయంలో జాతీయ రహదారిగా గుర్తించారు. 

అప్పట్లో ఆ రోడ్డును రీజినల్‌ రింగురోడ్డులో భాగంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండేది. కానీ, దాన్ని ఎక్స్‌ప్రెస్‌ వేగా నిర్మించాలని నిర్ణయించటంతో, ఉన్న పాత రోడ్డు బదులు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుగా నిర్మించాలని ఆ తర్వాత నిర్ణయించారు. ఫలితంగా ఆ రోడ్డు దీనికి సమాంతరంగా కొనసాగనుంది. అయితే రీజినల్‌ రింగురోడ్డు జాతీయ రహదారి ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకోనున్నందున, దానికి సమాంతరంగా కొనసాగే పాత రోడ్డును జాతీయ రహదారి హోదా తొలగించి తిరిగి రాష్ట్రరహదారిగా మార్చనున్నారు. 

అప్పుడు దానికి 161ఏఏ నంబరు తొలగిపోతుంది. దాని నిర్వహణ పూర్తిగా రాష్ట్రప్రభుత్వ అధీనంలోని ఆర్‌అండ్‌బీ పరిధిలోకి చేరుతుంది. ఇప్పటికే 161 నంబరుతో ప్రధాన జాతీయ రహదారి, 161ఏ నెంబరుతో మరో రోడ్డు ఉన్నందున 161ఏఏ నంబరు ఏర్పడింది. మూడు రోడ్లకు అదే నంబరు ఉండనున్నందున అయోమయం లేకుండా రీజినల్‌ రింగురోడ్డుకు కొత్త నంబరు కేటాయించాలన్న అభిప్రాయం కూడా ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటివరకు 161 ఏఏతోనే రీజినల్‌ రింగురోడ్డు కొనసాగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement