
చౌటుప్పల్, సంగారెడ్డి శివారు ప్రాంతాల ఆర్‌ఆర్‌ఆర్ నిర్వాసితుల డిమాండ్
ఉత్తర భాగం రోడ్డు నిర్మాణ టెండర్లు ఖరారయ్యే వేళ ఆందోళన బాట
ప్రభుత్వం పరిహారం పెంచుతుందని నచ్చజెప్పుతున్న స్థానిక కాంగ్రెస్ నేతలు
వచ్చే నెలలో పరిహారం చెల్లించి భూములు స్వాదీనం చేసుకోనున్న ఎన్‌హెచ్‌ఏఐ
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో అలైన్‌మెంట్ మార్చడంతోపాటు భూ పరిహారం పెంచాలంటూ నిర్వాసితులు ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్–సంగారెడ్డి శివారు ప్రాంతాల్లో సమస్య నివురుగప్పిన నిప్పులా ఉంది. చౌటుప్పల్‌కు కనీసం 50 కి.మీ. ఆవల ఆర్‌ఆర్‌ఆర్ ఉంటుందని తొలుత చెప్పి చివరకు పట్టణానికి 25 కి.మీ. దూరంలోనే అలైన్‌మెంట్ ఖరారవడం వెనుక ఓ బడా పరిశ్రమను కాపాడే ఉద్దేశం దాగి ఉందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.
ముందుగా అనుకున్న అలైన్‌మెంట్ ప్రకారం ఆ పరిశ్రమ ఆర్‌ఆర్‌ఆర్ లోపలివైపు అవుతుందని.. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) లోపలి వైపు ఉన్న పరిశ్రమలను అవతలి వైపు తరలించాలన్న అంశం తెరపైకి వచ్చినట్లుగానే భవిష్యత్తులో ఆర్‌ఆర్‌ఆర్ లోపలి వైపు ఉన్న పరిశ్రమలను సైతం దూరంగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ పరిశ్రమకు ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో అధికారులు అలైన్‌మెంట్ మార్చారని నిర్వాసితులు వాదిస్తున్నారు.
దీనికితోడు గతంలో జాతీయ రహదారి కోసం భూమి కోల్పోయి, ఆ తర్వాత డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కోసం భూమి కోల్పోయి, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ కోసం కూడా భూమి కోల్పోతే ఇక తమకు మిగిలేదేమి ఉంటుందని నిర్వాసితుల్లో ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ ప్రభుత్వం పరిహారమన్నా ఎక్కువ ప్రకటించిందా అంటే భూముల ధరలతో పోలిస్తే ఎనిమిదో వంతు కూడా లేదని వారు వాపోతున్నారు. త్వరలో జిల్లా కలెక్టరేట్ ముట్టడితో ఆందోళనను మరోసారి ఉధృతం చేస్తామని చెబుతున్నారు.
సంగారెడ్డి వద్ద కూడా..
సంగారెడ్డి పట్టణానికి చేరువగా ఉన్న సదాశివపేట్, కొండాపూర్ మండలాల్లోని ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌కు చేరువగా ఉండే ప్రాంతాల్లో ఒక్కో ఎకరం మార్కెట్ రేటు ప్రకారం రూ. 2–3 కోట్ల దాకా పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాత్రం రూ. 30 లక్షల్లోపే ఉంటుందన్న ప్రచారం జరగడంతో ఈ ధరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు.
పరిహారం పెంపు కోసం గతంలో ఆందోళనలు చేసిన నిర్వాసితులు తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యేతో వారు చర్చించగా పరిహారాన్ని పెంచాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టాలని ఆయన సూచించారు.
రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు
ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోందన్న వార్తలు వస్తుండటంతో కొందరు కాంగ్రెస్ నేతలు భూ నిర్వాసితుల ఆందోళనకు తెరదించేలా అనుకూల ప్రచారం ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లో భూముల ధరల పెంపు ఎంత ఉన్నా రింగు అలైన్‌మెంట్ పరిధిలోకి వచ్చే భూముల ధరలను మాత్రం ప్రభుత్వం భారీగా పెంచనుందని.. అందువల్ల ఆందోళనకు దిగొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసు సహకారం తీసుకోనున్న ఎన్‌హెచ్‌ఏఐ..
వచ్చే నెలలో సుమారు రూ. 2 వేల కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి భూములను అ«దీనంలోకి తీసుకోవడానికి ఎన్‌హెచ్‌ఏఐ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి పంటలు వేసుకున్న భూములను వదిలేసి మిగతా వాటిని స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధమవుతోంది. గెజిట్ విడుదలతో సాంకేతికంగా ఆ భూములన్నీ ఎన్‌హెచ్‌ఏఐ అధీనంలోకి వచి్చనప్పటికీ భౌతికంగా వాటిని స్వా«దీనం చేసుకోవాల్సి ఉంది. ఆ సమయంలో నిర్వాసితులు ఆందోళన చేసే అవకాశం ఉన్నందున పోలీసుల సహకారం తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది.