
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ (QR Code) ఏర్పాటు చేయడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సన్నద్ధమవుతోంది. ఇంతకీ ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు?, దీనివల్ల వాహనదారులకు ఉపయోగం ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ప్రయాణీకులకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే పొందేలా చేయడానికి.. ఎన్‌హెచ్‌ఏఐ జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లతో కూడిన సైన్‌బోర్డులను ఏర్పాటు చేయనుంది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
జాతీయ రహదారులపై ఏర్పాటు చేయనున్న క్యూఆర్ కోడ్ సైన్ బోర్డులు.. వాహనదారులకు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా.. నేషనల్ హైవేల సంఖ్య, చైనేజ్, ప్రాజెక్ట్ పొడవును సంబంధించిన వివరాలతో పాటు.. 1033తో సహా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌లను తెలుసుకోవచ్చు. టోల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్, ఎన్‌హెచ్‌ఏఐ ఫీల్డ్ ఆఫీసులు వంటి కీలక అధికారుల సంప్రదింపు వివరాలను కూడా పొందవచ్చు.
క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా.. హాస్పిటల్స్, పెట్రోల్ పంపులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, వెహికల్ రిపేర్ షాప్స్, టోల్ ప్లాజాలు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు వంటి సమీపంలోని అత్యవసర సేవలకు గురించి కూడా తెలుసుకోవచ్చు. రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు అవసరమైన సేవలను గుర్తించడంలో సహాయపడటం ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.
ఇదీ చదవండి: కొత్త రూల్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ తప్పనిసరి!
జాతీయ రహదారులపై ఈ క్యూఆర్ సైన్‌బోర్డులను.. రోడ్ స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ల వద్ద మాత్రమే కాకుండా, టోల్ ప్లాజాల దగ్గర, రోడ్డుపక్కన కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ క్యూఆర్ కోడ్స్ రహదారి భద్రతను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల గురించి వినియోగదారు అనుభవాన్ని, అవగాహనను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.