
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ లే ఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు కారణంగా భారీ తొలగింపునకు టీసీఎస్ సన్నద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగాల‍్లో 2 శాతం లే ఆఫ్స్ కు సిద్ధమైన విషయాన్ని కంపెనీ ఆదివారం స్పష్టం చేసింది.
అంటే 12వేలకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోనన్నారు. ఇది మధ్యస్థంగా ఉన్న ఉద్యోగులతో పాటు సీనియర్ స్థాయిల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె కృతివాసన్ స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల్ని తొలగించడం తమకు కూడా బాధగానే ఉందని, కాకపోతే మారిన టెక్నాలజీతో తొలగింపులు తప్పడం లేదన్నారు.
కొత్త టెక్నాలజీల పరంగా చూస్తే ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నాం. పని చేసే విధానాలూ మారుతున్నాయి. అందుకే భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఏఐని ఉపయోగిస్తూ కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో ఉన్నాం.
మా కంపెనీ విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాం. కానీ, పలు విభాగాల్లో వృద్ధి కనిపించడం లేదు. దాంతో లే ఆఫ్స్ తప్పడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మా ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధ్యస్థ, సీనియర్ స్థాయుల్లో ఉండే ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం అనుకున్నంత ఈజీ కాదు. సీఈఓగా నేను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటి’ అని కృతివాసన్ తెలిపారు.