దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంత మంది ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) నిబంధనలను గత త్రైమాసికాల్లో పాటించని వారికి వార్షికోత్సవ ఆధారిత పనితీరు శాలరీ అప్రైజల్స్‌ను నిలిపివేసినట్లు సమాచారం.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్‌లో, ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన అనంతరం వార్షిక సైకిల్ ప్రకారం అప్రైజల్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన ఫ్రెషర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అలాగే సంస్థ అంతర్గత పోర్టల్ ‘అల్టిమాటిక్స్’లోనూ ఈ అప్‌డేట్ కనిపిస్తుంది.
ఈమెయిల్‌లో ఏం చెప్పిందంటే..
“మీ వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, Q2 FY26 (జూలై 2025 – సెప్టెంబర్ 2025) వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాటించకపోవడంతో కార్పొరేట్ స్థాయిలో తదుపరి ప్రాసెసింగ్ జరగలేదు. జనవరి 2025లో మీ వార్షికోత్సవం ఉన్నప్పటికీ Q3లోనూ WFO పాటించకపోతే, మీరు FY26 బ్యాండింగ్ సైకిల్‌కు అనర్హులవుతారు. పనితీరు బ్యాండ్ విడుదల చేయబడదు” అని ఓ ఉద్యోగికి పంపిన ఈమెయిల్‌లో టీసీఎస్ యాజమాన్యం పేర్కొందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించింది.
ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న తొలి ప్రధాన భారతీయ ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. ఇతర ఐటీ సంస్థలు సాధారణంగా వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే కార్యాలయ హాజరును తప్పనిసరి చేస్తుండగా, టీసీఎస్ ఆఫీస్ హాజరును వేరియబుల్ పే, అప్రైజల్స్‌తో అనుసంధానించింది.
టీసీఎస్‌లో వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదట కంపెనీ లాంఛనంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అనంతరం సూపర్‌వైజర్ ఉద్యోగి గోల్ షీట్‌ను సిద్ధం చేస్తారు. సదరు ఉద్యోగి దానిని సమీక్షించి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రైజర్‌తో చర్చలు జరుగుతాయి. సంవత్సరంలో సాధించిన లక్ష్యాల ఆధారంగా పనితీరు మూల్యాంకనం నిర్వహించి, తుది బ్యాండింగ్ ఫలితాలను విడుదల చేస్తారు.
కాగా 2022లో లేటరల్ నియామకాల (లాటరల్ హైర్స్) కోసం టీసీఎస్ చివరి వార్షికోత్సవ అప్రైజల్స్‌ను నిలిపివేసింది. ఇక గతేడాది టీసీఎస్ తన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మినహాయింపు విధానంలో మార్పులు చేసింది. భారతదేశంలోని ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసం గరిష్టంగా ఆరు రోజుల వరకు మినహాయింపులు పొందవచ్చు. ఉపయోగించని రోజులను తదుపరి త్రైమాసికానికి మళ్లించుకునే అవకాశం లేదు.
ఇది చదివారా? ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!
కార్యాలయ స్థల పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులు ఒకే ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్‌వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు మాత్రమే నివేదించవచ్చు. అయితే హాజరు మినహాయింపుల కోసం బల్క్ అప్‌లోడ్లు లేదా బ్యాకెండ్ ద్వారా సబ్‌మిట్ చేయడాన్ని కంపెనీ నిషేధించింది.


