
అమరావతి ఓఆర్‌ఆర్ కోసం డీపీఆర్
190 కిలో మీటర్లు 140 మీటర్ల వెడల్పుతో నిర్మాణానికి ప్రణాళిక
సాక్షి, అమరావతి: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) కంటే పెద్దగా అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 190 కి.మీ.మేర 140 మీటర్ల వెడల్పులో భూసేకరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్మించింది. మొత్తం 190 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రూ.24,790 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను అందజేసింది.
అమరావతి ఓఆర్‌ఆర్ డీపీఆర్‌లో ప్రధాన అంశాలు ఇవీ...
👉హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పొడవు 158 కి.మీ. కాగా, అమరావతి ఓఆర్‌ఆర్‌ను 190 కి.మీ. మేర నిర్మించాలని నిర్ణయించారు. ఆరు లేన్లుగా ఓఆర్‌ఆర్‌ను నిర్మిస్తారు. అందుకోసం అమరావతిలో 190 కి.మీ. పొడవునా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. భూసేకరణ వ్యయంలో రూ.వెయ్యి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
👉ఓఆర్‌ఆర్‌లో భాగంగా కృష్ణా నదిపై రెండు వంతెనలు నిర్మిస్తారు. ముప్పలూరు వద్ద 3.15 కి.మీ. మేర మొదటి వంతెన, మున్నంగి వద్ద 4.8 కి.మీ. మేర రెండో వంతెన నిర్మించాలని నిర్ణయించారు. గంగినేనిపాలెం అటవీప్రాంతంలో రెండు టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి టన్నెల్ 1.64 కి.మీ., రెండో టన్నెల్ 2.68 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇందుకోసం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.
👉అమరావతి ప్రాంతాన్ని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానిస్తూ రెండు స్పర్ రోడ్లు నిర్మిస్తారు. తెనాలి నుంచి కాజ టోల్ ప్లాజా వరకు 17.5 కి.మీ. మేర మొదటి స్పర్ రోడ్డు, నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.20 కి.మీ. మేర రెండో స్పర్ రోడ్డు నిరి్మస్తారు.
👉అమరావతి ఓఆర్‌ఆర్ కోసం రూ.24,790 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,117 కోట్లు భరించనుంది. ప్రాజెక్టును 12 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.