
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు తాజాగా మరింత ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో కొత్త వాహనాల కొనుగోలు కోసం భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి కరకట్ట ప్యాలస్ ఖర్చులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవలే సీఎం నివాసంగా ఉపయోగిస్తున్న కరకట్ట ప్యాలస్ మరమ్మతులు, సౌకర్యాల కోసం రూ. కోటి 21 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇది కొత్తది కాదు. గత రెండు నెలల్లోనే కరకట్ట ప్యాలస్‌కు సంబంధించి రూ.95 లక్షలు, రూ.36 లక్షలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధుల్లో
రూ.20 లక్షలు: మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకు
రూ.16.50 లక్షలు: వంటశాల సదుపాయాల కోసం
రూ.19.50 లక్షలు: నివాసం చుట్టూ చెదల నివారణకు
ఇంతకు ముందు కరకట్ట ప్యాలస్ సౌకర్యాల కోసం రూ. కోటి 44 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ రూ. కోటి 21 లక్షలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా, ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి సౌకర్యాల కోసం రూ.95 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఖర్చులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలకు దారి తీస్తున్నాయి.
