
నిన్న ఉద్యోగులకు వాత.. నేడు గ్రామాలపై కూటమి సర్కారు మోత
తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో ఇక యూజర్ చార్జీలు వసూలు
గ్రామీణ ప్రజలపై ఏటా రూ.1,036.97 కోట్ల వడ్డన
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది దాదాపు రూ.140 కోట్లే.. మిగతా ఏడు రెట్లకుపైగా భారం జనం నెత్తినే
ఇప్పటికే మంత్రివర్గం పచ్చజెండా.. జీవో విడుదల
తాగునీటి చార్జీల వసూలు బాధ్యత పంచాయతీలు, కమిటీలదే
తాగునీటి పథకాల మోటర్ల కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, మరమ్మతులు లాంటి నిర్వహణ వ్యయాలు.. కేంద్రం నుంచి నిధుల విడుదల తగ్గితే ప్రజలపై మరింత అదనపు భారం
ఇప్పటికే ప్రజలపై రూ.17 వేల కోట్లకు పైగా విద్యుత్తు చార్జీల బాదుడు.. సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ ఇంటి పన్నులు వసూలు చేయిస్తున్న సర్కారు
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గట్టి షాక్ ఇచ్చి ఒకరోజు గడవక ముందే పండగ పూట చంద్రబాబు సర్కారు మరో బాదుడుకు తెర తీసింది! కాకపోతే ఈసారి ఆయన సంధించిన బాంబు పల్లెల్లో పేలనుంది! గ్రామాల్లో తాగునీటి చార్జీల మోత మోగనుంది! దీపావళి కానుకగా.. గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి ఏటా రూ.వెయ్యి కోట్లకుపైగా తాగునీటి చార్జీల వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. సూపర్ సిక్స్, సెవెన్ పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్తు చార్జీలు, భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల మోత, ముక్కు పిండి ఆస్తి పన్ను వసూలుతో తమ నడ్డి విరుస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. అటు ఎన్నికల హామీలను నెరవేర్చకుండా.. ఇటు ఎడాపెడా బాదుడుతో చంద్రబాబు తన ట్రేడ్‌మార్కు మోసాలను కొనసాగిస్తున్నారని అన్ని వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. వైఎస్ జగన్ ఇచ్చిన వాటితోపాటు ఇంకా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు తమను దగా చేశారని సర్వత్రా చర్చ జరుగుతోంది.
బాధ్యత వదిలించుకుని బాదుడు..!
రక్షిత తాగునీటి పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు అందించే మంచినీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏటా రూ.1,680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఏకంగా రూ.1,036.97 కోట్లు ప్రజల నుంచి యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ వ్యయాన్ని ఆయా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు కేంద్రమిచ్చే ఆర్థిక సంఘం నిధుల నుంచి లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుండగా.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆ బాధ్యత వదిలించుకుని యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై భారం మోపడానికి సిద్ధపడింది.
ప్రజల నుంచి వసూలు చేయనున్న యూజర్ చార్జీల వివరాలు
మంత్రివర్గం ఆమోదం.. జీవో జారీ
తాగునీటిపై యూజర్ చార్జీల వసూలుకు రెండు నెలల క్రితమే మంత్రివర్గం ఆమోదం తెలుపగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలును లెక్క గట్టారు. రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగే చోట్ల ప్రతి వ్యక్తిపై సగటున ఏడాదికి రూ. 320 చొప్పున వసూలు చేయనుండగా, గ్రామ పరిధిలో అంతర్గతంగా రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట్ల ఏటా రూ.240 చొప్పున యూజర్ చార్జీల భారం పడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవో రూపంలో ఆదేశాలు వెలువడ్డ నేపథ్యంలో ఇక ఏ క్షణమైనా యూజర్ చార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రజల నుంచి రూ.1,036.97 కోట్లు వసూలు..
గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 3.81 కోట్ల జనాభాలో 60 శాతం మందికి చిన్న తరహా రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య (ఆర్‌డబ్ల్యూఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 549 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు నిర్వహణకు ఏటా రూ.518.69 కోట్లు వ్యయం కానుండగా, 29,469 చిన్న తరహా రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.1,031.42 కోట్లు, సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే పథకాలకు మరో రూ.130.18 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.
ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకయ్యే మొత్తం ఖర్చు రూ.1,680.29 కోట్లలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.503.67 కోట్లు వ్యయం చేయనున్నట్లు పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. మిగిలిన రూ.1,176.62 కోట్లలో రూ.1,036.97 కోట్లు ఆయా గ్రామాల్లో నివసించే ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయనుండగా కేవలం రూ.139.65 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు.
పంచాయతీల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ పాలసీలో యూజర్ చార్జీల గురించి పేర్కొన్న వివరాలు
నిర్వహణ ఖర్చులు పెరిగితే అదనపు భారం..
రక్షిత మంచినీటి పథకాల పరిధిలో పనిచేసే సిబ్బంది నెలవారీ జీతభత్యాలతోపాటు మోటర్ల విద్యుత్ చార్జీలు, బ్లీచింగ్ పౌడర్, నీటి శుద్ధిపై నాణ్యత పరీక్షలు లాంటివి నిర్వహణ వ్యయంలో ఉంటాయని ప్రభుత్వం పాలసీలో పేర్కొంది. పైపులైన్ లీకేజీలు, మోటర్ల మరమ్మతులు, విడిభాగాల కొనుగోలు దీనికి అదనం. భవిష్యత్‌లో సిబ్బంది వేతనాలు పెరిగినా.. విద్యుత్ చార్జీలు పెరిగినా ఆ మేరకు నిర్వహణ కూడా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా యూజర్ చార్జీల భారం ప్రజలపై పడే అవకాశం ఉంది.
కేంద్రం వాటా తగ్గితే మరిన్ని తిప్పలు..!
ప్రస్తుతం అమలులో ఉన్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ ఏడాది రూ.2,099 కోట్లు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు అందుతాయి. 15వ ఆర్థిక సంఘం గడువు 2026 మార్చి నెలాఖరుతో ముగియనుంది. 2026 ఏప్రిల్ నుంచి 16 ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వస్తాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు ల అనంతరం గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసే మొత్తం ఒకవేళ తగ్గినా.. లేదంటే ఆ నిధులను ప్రత్యేక అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఏవైనా నిబంధనలు విధించినా.. ఆ మేరకు రక్షిత మంచినీటి పథకాలపై కేంద్రం వాటా కు గండి పడుతుంది. ఆ రకంగా చూసినా ప్రజలపై యూజర్ చార్జీల భారం మరింత పెరిగే వీలుంది.
వసూలు బాధ్యత కమిటీలకు..
గ్రామ స్థాయిలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూపొందించిన పాలసీలో పేర్కొంది. తాగునీటి పథకం నిర్వహణ వ్యయం ఆధారంగా ఎప్పటికప్పుడు యూజర్ చార్జీలను నిర్ణయించడం, వసూలు చేసే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలు, నిర్వహణ కమిటీలదేనని ప్రభుత్వం పేర్కొంది. రెండు కంటే ఎక్కువ గ్రామాలకు నీటిని సరఫరా చేసే 549 సీపీడబ్ల్యూఎస్ స్కీంల పరిధిలో యూజర్ చార్జీల నిర్ణయం, వసూలు బాధ్యత ఆయా జిల్లా పరిషత్‌లకు చెందిన ప్రత్యేక స్టాండింగ్ కమిటీకి ఉంటుందని పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. నూతన పాలసీపై ఇప్పటికే ఎస్‌ఈ, ఈఈ, డిప్యూటీ ఎంపీడీవోలు, ఏఈ స్థాయి వరకు శిక్షణ పూర్తి అయింది. గ్రామ స్థాయి సిబ్బందికి నవంబర్, డిసెంబర్‌లో శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
భారమైన పన్నులు..
ఆస్తి ఉందన్న ఆనందాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు మిగలనివ్వడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఆస్తి పన్నులు భారీగా పెరిగాయి. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. రోజూ ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్షలు చేస్తూ తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోలేకపోతే చర్యలు తీసుకుంటామంటూ వారిని హెచ్చరిస్తోంది. పాత బకాయిలు ఉన్నాయంటూ నోటీసులు జారీ చేస్తూ, అన్నీ కలిపి ఒకేసారి కట్టాల్సిందేనంటూ పెనుభారం మోపుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో గతంలో స్థానిక పరిస్థితులను బట్టి పంచాయతీలు ఇంటి పన్ను వసూలు చేసే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ప్రతి చోటా వంద శాతం పన్ను వసూలు చేయాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక భూముల క్రయ విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలు నిర్ధారించే భూముల విలువను ఈ ఏడాది ఫిబ్రవరిలో 40 నుంచి 50 శాతం దాకా పెంచారు. దీనివల్ల కొనుగోలుదారులపై చార్జీల భారం అదనంగా పడింది.
కేంద్రం ఊరట.. బాబు బాదుడు!
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించి ఊరటనిస్తే.. రాష్ట్రంలో మాత్రం కూటమి సర్కారు ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దసరా, దీపావళి వేళ చాలా వరకు నిత్యావసరాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు లేదంటే తగ్గింపు ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చర్యలు చేపడితే.. చంద్రబాబు సర్కారు మాత్రం పండుగ సమయంలో జీవనాధారమైన తాగునీటిపై యూజర్ చార్జీల వసూలు పాలసీని ప్రకటించడం గమనార్హం.
వివిధ వస్తువులపై జీఎస్టీని తగ్గించిన కేంద్రం ఆ నిర్ణయాన్ని సెపె్టంబరు 22వ తేదీ నుంచి అమలులోకి తీసుకురాగా.. చంద్రబాబు ప్రభుత్వం అదే రోజు యూజర్ చార్జీల వసూలుకు సంబంధించి ‘‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ జీవో విడుదల చేసింది. అయితే జీవో నెంబరు 83 వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచకుండా ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది. గ్రామాల్లో ఇంటి పన్ను రూపంలో వసూలు చేసే మొత్తం కంటే నీటిపై ప్రతిపాదిత యూజర్ చార్జీలు చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం.
షాకులే షాకులు..
విద్యుత్తు చార్జీల వాత..
ఆస్తి పన్ను మోత
⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓట్లేసి గెలిపించండి.. కరెంటు చార్జీలు ఇంకా తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై ఏకంగా రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేశారు.
⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే వసూలు చేస్తున్న చార్జీలకు తోడు మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది. మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని ఇటీవల కమిషన్‌ను కోరాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ప్రజలపైనే భారీగా బండ పడుతుంది.