
ఇచ్చిన 9 హామీల్లో ఒక్క దాని గురించి కూడా సీఎం మాట్లాడలేదు.. పీఆర్సీ మీద ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశగా చూశారు
చర్చలకు వెళ్లిన సంఘాల నాయకులు హామీల గురించి ప్రశ్నించకపోవడం బాధాకరం
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా పెండింగ్ డీఏల్లో ఒక్కటే ఇస్తూ దాన్నే గొప్పగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం బాధాకరమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమకిచ్చిన 9 హామీలు అమలు చేస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తుంటే అవి వదిలేసి రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏల్లో ఒక్కటి ఇవ్వడానికి ప్రభుత్వం అంత హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాడేపల్లిలోని తమ సంఘ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలన్నీ ఏడాదికి రెండు డీఏలు ఇచ్చాయని, ఇప్పుడు ఒక్క పెండింగ్ డీఏ కోసం ఇంత హడావుడి చేయడాన్ని ఉద్యోగులు ఎప్పుడూ చూడలేదన్నారు.
16 నెలలపాటు ఉద్యోగులను పట్టించుకోకుండా డీఏ ఇవ్వడమే గొప్ప విషయమని చెప్పడానికే హంగామా చేసినట్లు కనబడుతోందని చెప్పారు. ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఆ హామీల్లో డీఏ లేదని అది రెగ్యులర్‌గా వచ్చేదేనని తెలిపారు. గత సంక్రాంతికి పోలీసులకు రెండు ఎస్‌ఎల్‌లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారని, కానీ ఇప్పుడు సీఎం మాత్రం ఒక్కటి మాత్రమే ఇస్తామని అది కూడా రెండు విడతలుగా ఇస్తామని చెప్పారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఐఆర్ ఒకటని దాని గురించి తమ సంఘాల నాయకులు అడిగారో లేదో తెలియదని పేర్కొన్నారు.
ఉద్యోగుల వైపు చూసేందుకే 16నెలలు
ఉద్యోగుల వైపు చూడ్డానికే సీఎంకు 16 నెలలు పట్టిందని ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులంతా పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఎదురు చూశారని, కనీసం పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తారని ఆశించారని, కానీ దాన్నే నియమించకపోతే ఇక పీఆర్సీ ఎలా ఇస్తారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలేదన్నారు. ఉద్యోగులు తమ బకాయిలను మరచిపోవాల్సిందేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించిన ఆయన సమావేశానికి హాజరైన తమ సంఘాల నాయకులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
సీపీఎస్ హామీపైనా మాట్లాడకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కరోనా వంటి ఏదైనా ఉపద్రవం వస్తే ఉద్యోగులు అర్థం చేసుకుంటారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏదీ లేకపోయినా ఉద్యోగులకు ఇస్తామన్న వాటిని ఇవ్వడంలేదని విమర్శించారు.
ఒక్క డీఏ ఇవ్వడానికి సంవత్సరన్నర పడితే మిగతా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలను భయపెట్టి ఒప్పించినా ఉద్యోగులు ఊరుకోరని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు 1.26 లక్షల మంది కలిశారు కాబట్టే గ్రామస్థాయిలో సేవలు బాగున్నాయని, వాళ్ల జీతా లు చాలా తక్కువని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.